సినీ పరిశ్రమను ఆదుకోండి.. నిర్మలతో సినీ ప్రముఖుల భేటీ

కరోనాతో కుదేలైన సినీ పరిశ్రమను ఆదుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కలిసి బడ్జెట్‌లో ఊరట ఇవ్వాలని విన్నతించారు. ఈ ప్రతినిధి బృందానికి పీవీఆర్‌ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ నాయకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌తో కలిసి సినీ ప్రముఖుల బృందం నిర్మలా సీతారామన్‌ను శుక్రవారం కలిసింది. కరోనా వల్ల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు పది నెలలకుపైగా మూతపడటంతో సినీ పరిశ్రమకు అపార నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సినీ పరిశ్రమకు పన్నుల రాయితీలు, ప్రొత్సాహకాలు ప్రకటించి ఆదుకోవాలని నిర్మలా సీతారామన్‌ను సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు.