దోమల నివారణకు చర్యలు చేపట్టండి..!

  • ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమం చేయాలి
  • పట్టణంలో దోమల నివారణ మందులు పిచికారి చేయాలి
  • మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • మున్సిపల్ కమిషనర్ కోరిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మున్సిపాలిటీలో దోమల నివారణకై చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు కోరారు. శనివారం మున్సిపల్ కమిషనర్ జె. రామప్పలనాయుడుని కలిసి ప్రస్తుతం రోగాల సీజన్ ప్రారంభమైనందున దోమల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డులతో పాటు పట్టణ సమీపంలోని కొత్తగా ఏర్పడిన కాలనీలలో సైతం దోమల నివారణ కోసం ఎబెట్, ఏసియన్ ఐదు శాతం తదితర మందులు పిచికారి చేయించాలన్నారు. అలాగే ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ లోని 30 వార్డుల్లో మురుగుతీత పనులు చేపట్టి పారిశుధ్య పనులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న 30 మురికి వాడలపై ప్రత్యేక దృష్టి సారించి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, పచ్చకామెర్లు తదితర రోగాలు బారిన ప్రజలు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కుళాయిల్లో బురద నీరు కాకుండా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు చెల్లించిన రూ.25,000, రూ.50,000ల మొత్తాలను దాదాపు రూ.2.34 కోట్లు తిరిగి చెల్లించాలన్నారు. అలాగే వాళ్లకు ఇళ్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ దోమల నివారణకు, పారిశుద్ధ్య పనులకు తగు చర్యలు చేపడతామన్నారు.