ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతo

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘన విజయాన్ని సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్‌ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకుల విధ్వంసక క్షిపణి(ఏటీజీఎం) పరీక్ష విజయవంతమైంది. బుధవారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ఆర్మర్డ్‌ కోర్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌(ఏసీసీఖీఎస్‌)లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఈ పరీక్షను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు కి.మీ. పరిధి వరకూ ఈ క్షిపణి దూసుకెళ్తుందని, లక్ష్యాలను పూర్తి కచ్చితత్వంతో ఛేదిస్తుందని చెప్పారు. లేజర్‌ కిరణాల ఆధారంగా పనిచేసే ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులు లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు వాటి కదలికలను గమనిస్తూ ప్రయాణిస్తుంది.

లేజర్‌ కిరణాల సాయంతో మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల సాయంతో ప్రయోగించేలా సిద్ధం చేశారు. పుణేలోని ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ, ఇన్‌స్ట్రుమెంట్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డెహ్రాడూన్‌)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.