కొవిడ్ నుంచి కోలుకున్న తారక్‌

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు తారక్‌. ‘కొవిడ్-19 పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. నేను త్వరగా కోలుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కొవిడ్ చాలా ప్రమాదకరమైంది. కానీ, ఇదొక వ్యాధే కాబట్టి తగిన జాగ్రత్తలు, పాజిటివ్ ఆలోచనలతో జయించవచ్చు. ఈ పోరాటంలో గెలిచేందుకు ధైర్యమే అతి పెద్ద ఆయుధం. ఆందోళన పడకండి. మాస్క్ ధరించండి.. ఇంట్లోనే ఉండండి’ అని కోరారు. మే 10న కరోనా బారిన పడ్డారు తారక్‌.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌గా నటిస్తున్నారు ఎన్టీఆర్‌. రామ్‌చరణ్ మరో కథానాయకుడు. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు.