తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా..

కరోనా కారణంగా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోలాగే తెలంగాణలోనూ పరీక్షల నిర్వహణపై ప్రభావం పడింది. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్‌తో పాటు, వొకేషనల్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వం పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఉంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది.

ఈ క్రమంలోనే ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటూ గతంలో ప్రకటన జారీ చేశారు. అయితే ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఇంటర్ బోర్డ్ మరోసారి ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్‌తో ప్రాక్టికల్స్‌తో పాటు వొకేషన్ ఇంటర్ కోర్సుల (ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌) ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాయిదా వేసింది. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో సమీక్షా సమావేశం నిర్వహించి.. పరీక్షల నిర్వహణను తేదీని 15 రోజుల ముందు ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని బోర్డు ప్రకటన జారీ చేసింది.