తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం

* గెలుపు కోసం భావోద్వేగంతో పని చేద్దాం
* శ్రీ మోదీ నాయకత్వంలో తెలంగాణ పరుగులు తీస్తుంది
* యువతకు పూర్తిస్థాయి అవకాశాలు కల్పించడంపై దృష్టి
* నా ఆలోచనను గౌరవించి వెంట నడిచిన నాయకులకు కృతజ్ఞతలు
* జనసేన – బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
* కూకట్ పల్లి నియోజకవర్గ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ 

‘జాతీయ భావాలు, విశాల దృక్పథం ఉన్న రెండు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుందో, దేశం కోసం ఆలోచించే బలమైన కార్యకర్తలు ఉద్వేగంతో పని చేస్తే ఎలాంటి విజయం వరిస్తుందో చాటి చెప్పాల్సిన సమయం ఇది. మనది డబ్బుతో కూడిన గెలుపు కాదు అని నిరూపించాలి. సమున్నత ఆశయం కోసం భావోద్వేగ బంధం కలిపిన కార్యకర్తలు బలంగా పని చేస్తే ఎంతటి గొప్ప విజయం కాంక్షిస్తుందో తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా జనసేన – బీజేపీ కార్యకర్తలు అన్ని పార్టీలకు ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ ఫంక్షన్ హాలులో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన – బీజేపీ పార్టీల బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు, కూకట్ పల్లి నియోజక వర్గం జనసేన అభ్యర్ధి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అధికారం కేవలం అగ్ర కులాలకు మాత్రమే పరిమితమైన మంత్రదండం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ దామోదరం సంజీవయ్య గారి తర్వాత మళ్లీ ఎస్సీ కులాలకు అధికారం రాలేదు. బీసీ కులాలకు అయితే ఇప్పటికీ అధికారం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని కూడా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కచ్చితంగా బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని బలమైన హామీతో ముందుకు రావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. భారతీయ జనతా పార్టీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తుంది అన్న మాటను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం దక్కాలి అనే ఓ గొప్ప ఆశయానికి కచ్చితంగా తెలంగాణ ప్రజలు అండగా నిలబడాలి. జనసేన పార్టీకి, బీజేపీకి చాలా భావసారూప్యతలు కనిపిస్తాయి. దేశ సమగ్రత కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రధానమైన ఉమ్మడి లక్షణం. సోషలిస్ట్ భావాలు, సనాతన ధర్మాన్ని రెండింటినీ జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది. హిందూ ఆలయాలు, హిందూ దేవతల మీద దాడులు జరిగితే ఎంత తీవ్రంగా స్పందిస్తామో ఇతర మతాలకు చెందిన ప్రార్థన ఆలయాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా అంతే బలంగా స్పందిస్తాం. 2014లో ఒక బలమైన నాయకత్వం దేశానికి అవసరం అనే కోణంలోనే శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచాం. 2014కు ముందు దేశంలో ఉన్న అరాచక పరిస్థితులు, భయానక వాతావరణం అన్నీ గమనించి దేశానికి బలమైన నాయకుడు కావాలని ఆశించాను. శ్రీ మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంచెలంచెలుగా ఎదగడం నన్ను ఆనందంలో ముంచెత్తింది. ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
*కూకట్ పల్లి గెలుపు కీలకం
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీ ప్రేమకుమార్ గారి గెలుపు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు అంతా ఒక్కటే అనే విషయం బలంగా గుర్తుపెట్టుకుని శ్రీ ప్రేమ కుమార్ గారి గెలుపునకు బలంగా పని చేద్దాం. ఈ గెలుపు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ బలాన్ని మరోసారి చాటి చెప్పే అవకాశం వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం రెండు పార్టీల కార్యకర్తల ఐకమత్యం చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇదే స్ఫూర్తిని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లాలి. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపిన వ్యక్తిని నేను. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఘోర ఓటమి తర్వాత కేంద్రంలో బీజేపీ రాకుంటే మమ్మల్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారో మాకు తెలుసు. ఆంధ్రాలో అధికారంలో ఉన్న నాయకులు ఎంతటి దుర్మార్గులో తెలుసు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మొదటి నుంచి నాకు అండగా నిలిచిన తీరు ఇప్పటికీ నాకు గుర్తే. ఆయన నాపై చూపించే ప్రేమ, వాత్సల్యం అమూల్యమైనవి.
*నన్ను నమ్మిన నాయకులకు కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో స్థానిక నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం చివరి వరకు పోటీ చేద్దామని భావించి, బీ ఫారంలు సిద్ధం అయిపోయిన తరుణంలో బీజేపీ పెద్దల అభీష్టం మేరకు పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ మొదట 32 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని భావించినప్పటికీ, బీజేపీ కేంద్ర పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు పొత్తు ధర్మం కింద 8 స్థానాల్లో మాత్రమే పోటీలో నిలిచాం. దీనికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నాయకులను అభినందిస్తున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించి ముందుకు సాగిన పార్టీ కీలక నేతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి నాతో నడిచి, నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్న పార్టీ నేతలకు రుణపడి ఉంటాను. పొత్తు గురించి చెప్పిన వెంటనే టికెట్ గురించి కాకుండా, పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న నాయకులకు, పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ నేతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్ధాంతాన్ని భావజాలాన్ని నమ్ముకుని ముందుకు వెళితే భవిష్యత్తులో ఎంత గొప్ప విజయాన్ని సాధించవచ్చో బీజేపీని చూసి నేర్చుకోవచ్చు. రెండు సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం అసేతు హిమాచలాన్ని ఎలా ప్రభావితం చేసిందో జనసేన పార్టీ కూడా కచ్చితంగా అలాంటి ప్రభావం చూపుతుంది. జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ అని నేను ఎప్పుడూ భావించను. విశాల జాతీయ దృక్పథం ఉన్న పార్టీ మనది. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని పార్టీ సిద్ధాంతాల్లో ఏర్పరచుకున్న పార్టీ. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా సహకరించాను. ఏనాడూ పదవి కోరుకోలేదు. దేశాన్ని బాగు చేయాలి అనే తపనతోనే బీజేపీ వెంట నడిచాం. భవిష్యత్తులోనూ బీజేపీతో ప్రయాణం చేయాలని భావిస్తున్నాం.
*జనసేన అండగా ఉంటుంది
ఒక జాతి కోసం నడిపే ఉద్యమాన్ని శాంతియుతంగా, హుందాగా సాగిస్తే ఎలా ఉంటుందో అన్నది శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ కార్యచరణ చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా పట్టు వదలకుండా ముందుకు తీసుకువెళ్లారు. ఒక జాతి బాగు కోసం అహర్నిశలు కష్టపడిన శ్రీ మందకృష్ణ గారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గుండెల్లో పెట్టుకుని కాపాడతానని చెప్పడం గొప్ప విషయం. నేను ఎక్కడికి వెళ్లినా, జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులను కలిసినా కచ్చితంగా వారి నోటి నుంచి శ్రీ మంద కృష్ణ గారు చేసిన పోరాటం ప్రస్తావన వస్తుంది. దివ్యాంగులకు అండగా నిలిచిన ఆయన గొప్ప మనసుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. జనసేన పార్టీ కచ్చితంగా తెలంగాణకు అండగా నిలబడుతుంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ బీజేపీతో కలిసి నడుస్తుంది” అన్నారు.
*ఇదే స్ఫూర్తితో వెళితే విజయం మనదే: శ్రీ ప్రకాష్ జావడేకర్
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు మాట్లాడుతూ “ఇదే స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ – జనసేన కలిసి ప్రయాణం చేస్తే కచ్చితంగా విజయం సాధ్యం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించారు. దేశ యువతకు దారి చూపించేలా బీజేపీ ప్రభుత్వం ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదు. పార్లమెంటులో బీజేపీ పట్టుబట్టడంతోనే తెలంగాణ కల సాకారమైంది. నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం కోసం గొంతు ఎత్తిన బీ ఆర్ ఎస్ నాయకులు ఇప్పుడు అధికారం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావు అంటూ కొత్త పాట పాడుతున్నారు. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం తోడు అయితే డబుల్ ఇంజిన్ వేగంతో తెలంగాణ అభివృద్ధి కచ్చితంగా సాధ్యం. భవిష్యత్తు కోసం యువతరం ఆలోచించి, బీజేపీ – జనసేన అవసరాన్ని అందరికీ చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అన్నారు.
*సమగ్ర మార్పు అవసరం: శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తెలంగాణలో సమగ్ర మార్పు అనేది కచ్చితంగా అవసరం. దేశాన్ని శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎలా ముందుకు నడిపిస్తున్నారో అదే రీతిలో తెలంగాణ రాష్టం వేగంగా ముందుకు వెళ్లాలి. కూకట్ పల్లి నియోజకవర్గ స్థాయిలో బీజేపీ – జనసేన కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలి. పొత్తు ధర్మం పాటించి రెండు పార్టీల బలాన్ని పోలింగ్ బూత్ లో ఓట్లు వేయించడంలో చూపించాలి. ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా రెండు పార్టీల కార్యకర్తలు బలంగా పని చేయాలి. మన భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతి అనేవి కీలకం. దేశం గురించి, ప్రాంతం గురించి సమగ్రంగా ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు నడవడం ఓ గొప్ప విషయం. పోలింగ్ ఏజెంట్లు ఒకసారి పూర్తిస్థాయిలో కూర్చుని పోలింగ్ సరళి, చేయాల్సిన పనులు, అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడుకోవాలి. రెండు పార్టీల నాయకత్వం సమగ్రంగా చర్చించుకుంటే కచ్చితంగా అది ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇస్తుంది” అన్నారు. ఈ సమావేశంలో జనసేన ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాజారామ్ రాజలింగం, పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్, పార్టీ ప్రోటోకాల్ కమిటీ ఛైర్మన్ శ్రీ మలినీడి తిరుపతిరావు, పార్టీ నేతలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ రామ్ తాళ్లూరి, శ్రీ యాతం నగేష్, శ్రీ పినిసి చంద్రమోహన్, బీజేపీ నేతలు శ్రీ మాధవరం కాంతారావు, శ్రీ పన్నాల హరీష్ రెడ్డి, శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.