మరో మూడు రోజులపాటు వర్షాలతో తడవనున్న తెలంగాణ

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం వెల్లడించారు. గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు  తప్పవని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

సరిహద్దు దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాల జిల్లాల్లో అల్పపీడనం కొనసాగనుంది. ఏడున్నర అడుగుల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. మరోవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.