మహారాష్ట్రలో తెరచుకున్న దేవాలయాలు

మహారాష్ట్రలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల గత ఏడు నెలలకుపైగా మూసి ఉన్న అలయాలు, వివిధ మతాల ప్రార్థనా స్థలాలన్నీ సోమవారం నుంచి తెరుచుకున్నాయి. దీపావళి పర్వదిన పురస్కరించుకుని సోమవారం నుంచి ప్రార్థన స్థలాలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించగానే ఇటు భక్తులు, అటు ఆలయాల సరిసరాల్లో పూలు, పూలదండలు, కొబ్బరి కాయలు, ప్రసాద సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల్లో ఆనందం వెల్లువిరిసింది. మొన్నటి వరకు ఉపాధిలేక ఖాళీగా ఉన్న పేద వ్యాపారులు సంతోషం పట్టలేక బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో కోవిడ్‌ నిబంధనలు, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సీఎం ఆదేశించారు. 

కోవిడ్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రార్థన స్థలాలు ప్రభుత్వం ఆదేశాల మేరకు మూసి ఉన్నాయి. కానీ, ఇటీవల వైన్‌ షాపులు, బార్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, నాటకాలు ప్రదర్శించే హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇదే తరహాలో ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి పై ఒత్తిడి రాసాగింది. దీంతో కరోనా వైరస్‌ తీవ్రత తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపధ్యం లో శనివారం లక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి ఆలయాలు తెరిచేందుకు అనుమతించారు. కరోనా విస్తరించకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు స్వయంగా రూపొందించుకున్నాయి.

కాగా, షిర్డీలోని బాబా ఆలయంలోకి పాస్‌లుంటునే అనుమతించాలని ఆలయ సంస్థాన్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా భక్తులందరిని కాకుండా రోజుకు ఆరు వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. పాస్‌లు పొందేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్‌ పదాధికారులు తెలిపారు. అదేవిధంగా ముంబైలోని ముంబాదేవి గర్భగుడిలోకి ఒకేసారి కేవలం ఐదుగురు భక్తులను అనుమతించనున్నారు. తోపులాటలు జరగకుండా క్యూను క్రమబద్దీకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆలయంలో క్రిమిసంహరక మందులు పిచికారి చేయనున్నారు. ఆ సమయంలో ఆలయం మూసి ఉంచనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్‌ టన్నెల్‌ ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ చేతిలో ఎలాంటి పూలు, హారాలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, ఇతర పూజ సామగ్రి పల్లెంతో రావొద్దని ఆలయ మేనేజర్‌ హేమంత్‌ మహాజన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభాదేవిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయం, పండరీపూర్‌లోని విఠల్, రుక్మాయి మందిరం, కొల్హాపూర్‌లోని తుల్జాభవాని మాత తదితర ఆలయాల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్‌ విస్తరించుకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.