అన్న మాట… నీటి మూట

* నాలుగేళ్లలో హంద్రీనీవా పనులకు తట్టెడు మట్టిపోయని వైసీపీ సర్కార్
* డిస్టిబ్యూటరీ కాల్వలు అస్తవ్యస్తం
* తమ ప్రభుత్వం వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామన్న హామీ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్
* ఈ వేసవిలోనూ ముందుకు కదలని పనులు

మావాడొస్తే సీమంతా సిరులు పండుతాయి.. నిలిచిపోయిన సాగునీటి పనులన్నీ ఆఘమేఘాల మీద పూర్తవుతాయని నమ్మి వైసీసీకి ఓటేసిన చివరి జిల్లాల సీమ ప్రజల ఆశలు జలసమిధలవుతున్నాయి. ముఖ్యంగా హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎన్నికల ముందు హామిలిచ్చిన వైసీపీ నాయకులు తర్వాత దానిని పూర్తిగా మర్చిపోయారు. హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టెడు మట్టి పోయలేదు. ఫలితంగా గతంలో తవ్విన కాలువల్లోనూ కంప పెరిగిపోతోంది. కట్టలు జారిపోతున్నాయి. కొన్నిచోట్ల రైతులే చందాలు వేసుకొని పనులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలినంత నీరు రాక సీమ ప్రాంత అన్నదాతలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సీమ చివరి జిల్లాలు అయిన అనంతపురం, కర్నూలు జిల్లాలకు హంద్రీనీవా పనులు ఏ మాత్రం మేలు చేయలేకపోయాయి.
* హంద్రీనీవా తొలిదశ పనుల్లో మిగిలిపోయిన డిస్టిబ్యూటరీ కాలువలను నిర్మిస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మేం పోరాడుతాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం…
– 2017 ఫిబ్రవరి 7వ తేదీన అనంతపురం జిల్లా, ఉరవకొండలో జరిగిన మహాధర్నాలో అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చెప్పిన మాటలివీ….
• శ్రీశైలం జలాశయం నుంచి నీటిని వివిధ దశల్లో ఎత్తిపోసి హంద్రీనీవా తొలిదశ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనేది లక్ష్యం. కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీలు నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మొత్తం 14 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక వేశారు.
• వైసీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువలకు కనీస పనులు జరగలేదు. దీంతో ఇవి పిల్లకాలువల కంటే దారుణంగా కనిపిస్తున్నాయి. గతంలో తవ్విన కాలువల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. గట్లు సైతం పూడిపోయే స్థితిలో ఉన్నాయి. దీంతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. రైతులు ప్రధాన కాలువల నుంచి మోటార్లు పెట్టుకొని నీరు తోడుకోవల్సిన దుస్థితి నెలకొంది. ఇది వారికి మరింత భారంగా మారుతోంది.
• శ్రీశైలంలో నీరున్నా హంద్రీనీవాకు నీరు వదలడం లేదు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, విద్యుత్ బిల్లుల బకాయిలతో ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. 2022 నవంబరులో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంలో హంద్రీనీవా కాలువలకు కొద్ది మొత్తంలో నీరు వదిలారు. అవీ కూడా చివరి ఆయకట్టు వరకు చేరలేదు.
• అనంతపురం జిల్లా పరిధిలో 1.18 లక్షల ఎకరాలకు నీరు అందించే హంద్రీనీవా పనులను 3 ప్యాకేజీలుగా చేసి అప్పగించారు. ప్యాకేజీ 33 కింద మొత్తం 20,574 ఎకరాలకు నీరు అందించేందుకు డిస్టిబ్యూటరీ కాలువలు తవ్వాల్సి ఉంది. 2004లో ఈ పనులు అప్పగించారు. అయితే పనుల్లో పురోగతి లేకపోవడంతో 2016-17 సంవత్సరంలో ప్యాకేజీ 33ఎ కింద తిరిగి టెండర్లు పిలిచారు. దీంతో కాలువ పనులు వేగంగా జరిగాయి. 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 2019 తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు మళ్లీ జరగలేదు. దీనికింద పనులు పూర్తికావాలంటే మరో 30 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది.
• దీనిలోనే 34వ ప్యాకేజీ కింద 17,500 ఎకరాలకు నీరు అందించే కాలువలు తవ్వాలి. ఈ పనుల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే తుదిదశలో 150 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అలాగే అనంతపురం జిల్లాలో 80,600 ఎకరాలకు నీరు అందించే కాలువల తవ్వకం 36వ ప్యాకేజీగా చేశారు. 2015లో ఈ పనులకు రీ టెండర్లు పిలిచారు. మొత్తం దీనికోసం రూ.336 కోట్లు అవుతుందని అంచనా వేయగా, రెండు ప్యాకేజీలుగా పనులు విడగొట్టారు. ఒక ప్యాకేజీలో రూ.246 కోట్లు, మరో ప్యాకేజీలో రూ.90 కోట్ల పనులు చేయాల్సి ఉంది. సుమారు 1400 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నా ఇప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు.
• పత్తికొండ జలాశయం కింద కర్నూలు జిల్లాకు సంబంధించి 61 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కాలువలు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీరు అందని పరిస్థితి నేటికీ ఉంది. 28, 29 ప్యాకేజీ పనులను 2020లో రద్దు చేశారు. 365 జీవో ప్రకారం ఆ పనులను అయిదేళ్ల వరకు మళ్లీ చేసే అవకాశం లేదు. తాజాగా దీనికోసం జలవనరుల శాఖ అధికారులు రూ.180 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీవో 365 నుంచి మినహాయింపును కోరుతున్నారు.
• ప్రధాన కాలువ పక్కనున్న రైతులు సైతం దానిలో నీటిని తోడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగానూ చితికిపోతున్నారు. ఒక్కో మోటారుకు రూ.15 వేల వరకు వారికి ఖర్చవుతోంది. సరఫరా కాలువల ద్వారా నీరు రాక పలువురు రైతులు బోర్లనే నమ్ముకుంటున్నారు. చాలా చోట్ల కాలువ పనులను రైతులంతా చందాలు వేసుకొని చేసుకుంటున్నారు తప్పితే… ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు.
• గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో హంద్రీనీవా ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. కనీసం గత ప్రభుత్వంలో ఆగిపోయిన కాలువలను పూర్తి చేసినా ప్రాజెక్టు కింద పంట వేసుకున్న రైతులకు ప్రయోజనకరంగా ఉండేది. అయితే గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా పూర్తిగా పడకేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.