టీటీడీ పరిధిలో పారిశుధ్య సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఏళ్ల తరబడి నామమాత్రపు వేతనాలు చెల్లించడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏళ్ల తరబడి విధుల్లో ఉన్నా రూ.11 వేలు మాత్రమే జీతం చూపిస్తున్నా చేతికి రూ. 8 వేలే వస్తోందని ఆ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నేటి జీవన పరిస్థితుల్లో ఈ వేతనం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. సులభ్ కాంప్లెక్సుల్లో పని చేస్తున్న 3,500 మంది కార్మికులు తమ బాధలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. దీంతో గత రెండు రోజులుగా కార్మికులంతా విధులకు హాజరుకాకుండా తిరుపతిలో నిరసన తెలుపుతున్నారు. వేతనాల పెంపుదల, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్పు, పాత సౌకర్యాల అమలు కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతోంది. వారికి జనసేన పార్టీ మద్దతు ఉంటుంది. సమస్య చేయి దాటకముందే, తిరుమలలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరం కాకముందే టీటీడీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించాలి. పారిశుధ్య కార్మికుల డిమాండ్లకు తగిన పరిష్కారం చూపాలని నాదెండ్ల మనోహర్ కోరారు.