పాక్‌ మాదక ద్రవ్యాల రాకెట్‌ను గుట్టురట్టు చేసిన ఆర్మీ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీతో సంబంధాలున్న మాదక ద్రవ్యాల రాకెట్‌ను ఆర్మీ గుట్టు రట్టు చేసింది. ఉదంపూర్‌లోని నార్త్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో కీలకమైన డేటాను దొంగిలించి పాక్‌కు ఇచ్చారన్న అంశంపై దర్యాప్తు చేస్తుండగా ఈ విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ముగ్గురు జవాన్ల హస్తం ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఉదంపూర్‌కు చెందిన ఓ జవాన్‌ కీలకమైన డేటాను చోరీ చేశాడని, మరో ఇద్దరు వేర్వేరు బెటాలియన్లకు చెందిన వారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ముగ్గురు కలిసి డేటా చోరీకి పాల్పడ్డారని చెబుతున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో కనీసం ఇద్దరు జవాన్లు ఉన్నారని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల విచారణలో తేలింది. వీరికి డ్రగ్స్‌ను ఎరగా వేసి..వారి వద్ద నుండి డేటాను తీసుకునేందుకు పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ బృందం ప్రలోభ పెట్టిందని అధికారులు చెప్పారు.