జీఎస్టీ విధానానికి నాలుగేళ్లు… నిర్మలా సీతారామన్ వివరణ

దేశంలో జీఎస్టీ విధానం తీసుకువచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ విధానం వ్యాపారులకు, వినియోగదారులకు ఉభయతారకంగా ఉందని వివరించారు. దీనివల్ల ఎవరూ నష్టపోవడంలేదని తెలిపారు. జీఎస్టీకి ముందు పన్నుపై పన్ను ఉండడంతో 31 శాతం వరకు పన్ను మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని, జీఎస్టీ తీసుకువచ్చాక ఆ సమస్య తొలగిపోయిందన్నారు.

2017 జులై 1వ తేదీకి ముందు 17 రకాల సుంకాలు ఉండేవని, జీఎస్టీ రాకతో అవన్నీ పోయాయని వెల్లడించారు. గతంలో వ్యాపారులు తమ ఆర్థిక సంబంధ లావాదేవీలపై 495 రకాల దరఖాస్తులు చేసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు వాటి సంఖ్య 12కి తగ్గిందని, అది జీఎస్టీ చలవేనని వివరించారు.

జీఎస్టీ ఎంతో సరళతరమైనదని, ఇందులో 4 శ్లాబు రేట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 12 శాతం పన్నుతో కొన్ని రకాల వస్తువులు, 18 శాతం పన్నుతో మరికొన్ని రకాల వస్తువులు, కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై 28 శాతం పన్ను, అత్యవసరాలపై 5 శాతం పన్ను అమలులో ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు.