5 రాష్ట్రాలకు అదనపు సాయం అందించనున్న కేంద్రం

గత ఏడాదిలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, మిడతల దాడి వంటి విపత్తులతో అతలాకుతలమైన ఐదు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాయం అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 3,113 కోట్లను అందించేందుకు కేంద హోం శాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరిలకు నేషనల్‌ డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌(ఎన్‌డిఆర్‌ఎఫ్‌ఎం) నుండి అదనపు కేంద్ర సాయం అందించనున్నట్లు హోం శాఖ వెల్లడించింది. నివర్‌, బురేవితో పాటు మిడతల దాడి వంటి ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ అదనపు సాయాన్ని అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ రూ. 280. 78 కోట్లు, బీహార్‌ 1,255.27 కోట్లు రూపాయలు, తమిళనాడు రూ286.91 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 1280.18 కోట్లు కేటాయించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రూ. 9.91 కోట్లు అందించనుంది.