యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు

*కావాలనే ఈ ప్రాంతంలో యువ నాయకత్వాన్ని తొక్కేశారు
*వైసీపీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు
*కొబ్బరి రైతుకు ఇస్తామన్న రూ.15 వేల హామీ ఏమైంది?
*తెలంగాణతో పోలిస్తే నిరుద్యోగ రేటు మన దగ్గర డబుల్
*ఈ ప్రాంత నాయకులు కొండల్ని మింగేస్తూ… కోట్లు కొల్లగొడుతున్నారు
*రణస్థలం యువశక్తి సభలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 

యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. మన భవిష్యత్తు కోసం… మన ప్రాంత భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిరాశలో కూరుకుపోయిన ఉత్తరాంధ్ర యువతలో భరోసా నింపడానికే యువశక్తి కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారన్నారు. సంక్షేమం అంటే కేవలం బటన్ నొక్కడమే అని భావిస్తోన్న నియంత ముఖ్యమంత్రికి మనమంతా కలిసి బుద్ధి చెప్పాలని అన్నారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… “ కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రాంతాల కోసం జనసేన పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించలేదు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో పార్టీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు షేర్ చేసినందుకు యువకులపై దాడులు చేసి, కేసులు పెట్టి ఈ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోంది. యువత మంచి నాయకత్వాన్ని కోరుకుంటుంది.
*పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ముఖ్యమంత్రి గారూ….
జనసేన పార్టీ మీద, శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలకు మాత్రమే మంత్రులు, ముఖ్యమంత్రి సమయం కేటాయిస్తున్నారు తప్ప… ప్రజా సమస్యలు తీర్చడానికి ఇష్టపడటం లేదు. తిత్లీ తుపాన్ సమయంలో జగన్ రెడ్డి గారు పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నా… ఇక్కడ బాధితులను పరామర్శించడానికి ఒక్క రోజంటే ఒక్క రోజు రాలేదు. వారంలో నాలుగు రోజులు పాదయాత్ర చేయడం, కేసుల నిమిత్తం మూడు రోజులు హైదరాబాద్ వెళ్లడం పనిగా పెట్టుకున్నారు తప్ప బాధితుల పరామర్శకు ఒక్క రోజు రాలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా, కనీస మౌలిక సదుపాయాలు లేకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే 6 రోజుల పాటు ఉండి తిత్లీ తుపాన్ బాధితులకు అండగా నిలబడ్డారు. విజయనగరం జిల్లా పాదయాత్ర అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్ రెడ్డి గారు తిత్లీ తుపాన్ వల్ల నేలకూలిన ప్రతి కొబ్బరి చెట్టుకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. అలాగే ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పీహెచ్ సీల్లోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చేలేదు. మత్స్యకార భరోసా పథకం పచ్చి బూటకం. కేవలం వైసీపీ జెండా మోసిన వారికి మాత్రమే ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
*నిరుద్యోగ రేటు 9 శాతం ఉంది
భారతదేశంలో నిరుద్యోగ రేటు 6 శాతం ఉంటే… పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 4 శాతంగా నమోదైతే… మన రాష్ట్రంలో అయితే ఏకంగా 9 శాతం ఉంది. ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే కాకుండా చదువు కోవడం కోసం కూడా వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకార సోదరులు కేవలం నెలకు రూ. 15 వేల జీతం కోసం సుదూర ప్రాంతాలైన గుజరాత్, చెన్నై, పారాదీప్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఒక గదిలో 50 నుంచి 60 మంది గడుపుతున్నారు. ఈ ప్రాంతంలో 900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. కేవలం రూ.40 కోట్లు వెచ్చించి జెట్టీ నిర్మిస్తే వలసలు నిరోధించవచ్చని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
*ఉత్తరాంధ్రను మైనింగ్ మాఫియా కమ్మేసింది
ఒక మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ మాత్రమే అంటాడు… మరొకరు విశాఖనే ఏకైక రాజధాని అంటాడు. ఇప్పుడు ఈ జిల్లా మంత్రి రాజధాని కాదు రాష్ట్రామే కావాలంటున్నాడు. 30 ఏళ్లుగా వీళ్లే మంత్రులుగా చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం పేరు చెప్పుకొని కొన్ని కుటుంబాలు వేలకు వేల కోట్లు దోచుకుంటున్నాయి. ప్రకృతి వనరులైన పచ్చని కొండల్ని పిండి చేశారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి మైనింగ్ లో కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ప్రాంత నాయకులకు నిజంగా చిత్తుశుద్ది ఉంటే పెట్టుబడులు ఆకర్షించి, పరిశ్రమలు స్థాపించి యువతకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉత్తరాంధ్ర యువత కోరుకునేది ఒక్కటే…. తమ ప్రాంతంలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నారు. దానిని నెరవేర్చండి చాలు.
*పెట్రోల్, డీజిల్ ధరలు మన దగ్గరే ఎక్కువ
మాది సంక్షేమ ప్రభుత్వమని కొంతమంది వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ లకు మన రాష్ట్రమే దేశంలోకెల్లా ఎక్కవ రేటు వసూలు చేస్తోంది. వాహనమిత్ర పథకం ద్వారా డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి ఫైన్ల పేరుతో లాక్కుంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు. ఈ పథకం కింద వేల కోట్లు దోచేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ అని చెప్పుకుంటున్న విజయనగరం జిల్లా గుంకలాంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు స్వయంగా పరిశీలించాం. రైతుల నుంచి 397 ఎకరాలు సేకరించారు. 12 వేల మందికి ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. కనీసం వందమందికి కూడా ఇళ్లు నిర్మించలేదు. యువశక్తి సభలో మీ గొంతు వినపించండి అని పార్టీ తరఫున చెప్పగానే 6,400 మంది కాల్ చేశారు. 1240 మంది ఈ మెయిల్స్ పంపించారు. ఆ 8 వేల మందిలో 100 మందిని ఈ రోజు స్టేజ్ పై కూర్చొబెట్టాం. ఈ ప్రాంతంలో యువశక్తిని కొంతమంది తొక్కిపెట్టారు. వారిలో ధైర్యం నింపడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారని శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు.