దేశానికి వ్యాక్సీన్ డెలివరీ సిస్టం అవసరం

దేశ భౌగోళిక పరిస్థితులను, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది మొదట్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తుండటంతో.. వ్యాక్సిన్ పంపిణీ ఏ రకంగా ఉండాలనే దానిపై ఆయన అధికారులతో సమీక్షించారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలని ఆయన అధికారులకు వివరించారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలని అన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. దేశంలోని కరోనా మహమ్మారి పరిస్థితి, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతపై అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్‌వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ అధికారులకు తెలిపారు.

ఇందుకు దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.