మన విద్యకు గమ్యస్థానం అంతర్జాతీయ స్థాయి విద్య

‘నూతన జాతీయ విద్యావిధానం-2020’ భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో విద్యకు గమ్యస్థానంగా నిలబెడుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఐటీ-గువాహటి కాన్వకేషన్‌లో పాల్గొన్న ప్రధాని.. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు విదేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనున్నదని తెలిపారు. మన విద్యావిధానం సరిహద్దులు దాటి విస్తరించాలనే భారతదేశ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఐఐటీ గువాహటి కీలకపాత్ర పోషించాలని కోరారు.

‘నేడు మీలాంటి యువత మెదళ్లలో మెదులుతున్న ఆలోచనలే రేపటి భారతదేశపు భవిష్యత్తు’ అని ఐఐటీ గువాహటి విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు. ‘మీ భవిష్యత్తు కోసం మీరు కంటున్న కలలే నిజమైన భారతదేశానికి రూపాన్ని ఇస్తాయని’ ఆయన వ్యాఖ్యానించారు. ఇది భవిష్యత్తు నిర్మాణానికి సన్నద్ధం కావాల్సిన సమయమని ప్రధాని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కూడా పాల్గొన్నారు.