వరదలు సృష్టించిన విలయం వర్ణనాతీతం

* క్షణమొక యుగంగా లంక, విలీన గ్రామాల జనం
* ఇల్లు వాకిలి వదిలి సురక్షిత ప్రాంతాలకు
* అన్నం, పాలు, నీళ్లకు కూడా కటకట
* సర్కారు సహాయ చర్యలు అరకొరే

గోదావరి వరదల కారణంగా కోనసీమ సహా పూర్వపు గోదావరి జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలు ముఖ్యంగా ఆహార పొట్లాలు, పాలు, నీళ్లు అందకపోవడంతో ఈ ప్రాంతంలోని 81 లంక గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ముందస్తుగాగాని, వరదలొచ్చాకగాని సహాయ, పునరావాస చర్యలు సక్రమంగా తీసుకోకవడం ఈ ప్రాంత ప్రజల పాలిటి శాపంగా మారింది. చేస్తున్న అరకొర సాయం బాధిత ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. గోదావరి లంక గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలి తలా ఒక దిక్కుకు పయనమయ్యారు. కొందరు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇక్కడ చాలినన్ని సౌకర్యాలు లేవు. వరదలు మొదలై ఆరు రోజులు దాటుతున్నా ఆహారం, పాలు సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
* కంటి మీద కునుకు లేని 81 లంక గ్రామాలు
గోదావరి భారీ వరదల నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు లంక గ్రామాల పరిస్థితిపై నిలిచింది. నీట మునిగిన ఈ గ్రామాల ప్రజలను కాపాడాలని, వరద సమయంలో కనీస సౌకర్యాలతో పునరావాసం కల్పించాలన్న ధ్యాస రాష్ట్ర సర్కారుకు లేకపోవడం వింతగా ఉంది. కొత్తగా ఏర్పడిన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 51, తూర్పు గోదావరిలో ఆరు, పశ్చిమ గోదావరిలో 24 ఇలాంటి లంక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ పాయల మధ్య విస్తరించి ఉన్నాయి. మరో ఆరు గ్రామాలు రాజమహేంద్రవరం సమీపంలోని అఖండ గోదావరి వద్ద ఉన్నాయి. 1986 నాటి భయానక, ఉధృత వరదలు ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత రావడంతో గోదావరిని ఆనుకుని ఉన్న ఈ గ్రామాల ప్రజలు ముందుచూపు లేని ప్రభుత్వం వల్ల నానా కష్టాలు పడుతున్నారు.
* మంత్రి జోక్యం చేసుకుంటే గాని అందని నిత్యావసరాలు
కోనసీమ జిల్లా పీ గన్నవరంలోని ప్రజలు తమకు ఐదు రోజులుగా తిండీతిప్పలు లేవనీ, చంటి పిల్లలకు పాలు కూడా ప్రభుత్వ సిబ్బంది సరఫరా చేయడం లేదని అక్కడకు వచ్చిన జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్‌ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మంత్రి అధికారులను గట్టిగా మందలించాక బాధితులకు నిత్యావసరాలు అందించే పని మొదలైందంటే రాష్ట్ర సర్కారు వరదలు వంటి అత్యవసర పరిస్థితిలో ఎంత కుంటి నడక నడుస్తోందో అర్ధమౌతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదలంకలో అయితే పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది. అక్కడ ప్రజలను తరలించడానికి ప్రభుత్వ సిబ్బంది తగిన చర్యలు తీసుకోకపోవడంతో జనం అనేకచోట్ల తమ ఇళ్లపైనే ఐదు రోజులు ఉండాల్సి వచ్చింది. తమ ఇళ్లలోకి మొల లోతు నీరు వచ్చిన అనేక గ్రామాల జనం తమకు భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులను అభ్యర్థించగా వారి నుంచి వచ్చిన జవాబు అనేక మందిని కంటతడి పెట్టించింది. ఇళ్లు పూర్తిగా మునిగిపోలేదు కాబట్టి ప్రజలకు తాము ఆహారపొట్లాలు సరఫరా చేయలేకపోతున్నామని, సాయపడడానికి తమకు తగిన ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారు.
* పాత బకాయిలు అందక అందుబాటులోకి రాని పడవలు
గతంలో మాదిరిగా మునక గ్రామాల నుంచి ప్రజలను మెరక, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వానికి ఈసారి పడవలు అందుబాటులోకి రావడం లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న పడవల యజమానులకు ప్రభుత్వం నుంచి కిరాయి డబ్బులు ఇప్పటికీ రాకపోవడం దీనికి కారణం. వరదలు వంటి అత్యవసర సమయాల్లో సాయపడిన ప్రైవేటు బోటు యజమానులకు సకాలంలో డబ్బు చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు గీటురాయిగా నిలిచింది. ఐదు రోజుల భారీ వర్షాలు, వరదల తర్వాత మాత్రమే ప్రభుత్వ సహాయ చర్యలు ఓ మోస్తరు ప్రారంభమయ్యాయంటే జగన్‌ సర్కారు ఎంతటి ఉదాసీన వైఖరి అవలంబిస్తోందో తెలుస్తోంది. మునక గ్రామాలున్న ప్రాంతాల్లోని దాదాపు తొమ్మిది వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే వారిలో చాలా మందికి ఆహారపు పొట్లాలు అందనే లేదు. రెండు వేల పాల ప్యాకెట్లు పంపిణీ చేశామని ప్రకటించినా అవి బాధితులకు సరిపోలేదని చెబుతున్నారు. వరదలతో అతలాకుతలమైన ఐదు జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని బీసీ సంక్షేమ, పౌరసంబంధాల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సోమవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అయితే అవి ఏమాత్రం సరిపోవడం లేదు. వాటిలో సౌకర్యాలూ సంతృప్తికరంగా లేవు.
*అనుభవ లేమీ అడ్డుగా నిలిచింది
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమ జిల్లాలోని 67 లంక గ్రామాల ప్రజలు ఎక్కువ కష్టాలపాలయ్యారు. 20 మండలాలలోని 67 లంక గ్రామాల ప్రజలకు తినడానికి తిండి, తలదాచుకోవడానికి ఏర్పాట్లు లేవు. తమ ఇళ్లు నీట మునగడంతో సామాన్లు తీసుకునే వీలు కూడా లేకుండా పోయింది. జనం అన్నీ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరదలు మొదలైన ఐదు రోజులకు కూడా ఈ ముంపు లంక గ్రామాలకు అధికారులు రాలేదు. అంతటి ఇబ్బందులు లేని లంక గ్రామాల్లో మాత్రమే ప్రభుత్వ సిబ్బంది సహాయ చర్యలకు ఉపక్రమించారు. ఇలా సర్కారు సిబ్బంది నుంచి సాయం అందకపోవడంతో ప్రజలే తమకు అందుబాటులో ఉన్న పడవల్లో వెళ్లి నీరు, ఇతర నిత్యావసరాలు తెచ్చుకుంటున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు 67 లంక గ్రామాల్లోని లక్ష మందికి పైగా జనం కూడు, నీడ లేక అశాంతి అనుభవించారు. ఇటీవల రెండు గోదావరి జిల్లాలను విడగొట్టి ఆరు చేయడంతో కలెక్టర్లు మొదలు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల వరకూ కొత్తవారే కావడం కూడా వరద సహాయ, పునరావాస కార్యక్రమాలకు విఘాతం కలిగించింది.
* విలీన మండల గ్రామాల్లో విలవిల్లాడిన ప్రజలు
పోలవరం ఆనకట్ట నిర్మాణం దృష్టిలో ఉంచుకుని పూర్వపు ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌ నుంచి 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల గ్రామాలు ఎప్పటిలాగానే ఈసారి గోదావరి వరదల్లో చిక్కుకుపోయాయి. పూర్వపు ఖమ్మం జిల్లా నుంచి వచ్చి చేరిన గ్రామాలను ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చేర్చారు. ఈ జిల్లాలోని కూనవరం గ్రామం వరదల ప్రభావంతో అతలాకుతలమౌతోంది. కొండమొదలు ప్రాంతంలోని మూడు గిరిజన గ్రామాల ప్రజలు తగినంత సాయం అందక అల్లాడుతున్నారు. అల్లూరి జిల్లాలోని అనేక గ్రామాలు గోదావరి వరదనీట మునిగాయి. ఈ విలీన మండలాల్లోని అనేక గ్రామాలు పోలవరం ఆనకట్ట నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల ప్రస్తుత వరదల్లో బాగా నష్టపోయాయి. విలీన మండలాల గ్రామాలు కొన్ని ఏలూరు జిల్లాలో కూడా చేర్చారు. మొత్తానికి ఈ రెండు కొత్త జిల్లాలలోని విలీన మండలాల గ్రామాలు వరద నీటితో చెప్పనలవి కానంతగా నష్టపోయాయి. పోలవరం ప్రాజెక్టు ప్రభావం వల్ల అల్లూరి జిల్లాలోని ఏటపాక, చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, దేవీపట్నం గ్రామాలు, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం పల్లపు ప్రాంతాల ప్రజలు గోదావరి ఉగ్రరూపంతో నానా పాట్లు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పోలవరం సాగునీటి ఆనకట్ట వల్ల పరిసర గ్రామాలు బాగా నష్టపోతాయని నిపుణులు చెప్పిన మాటలు నిజమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్య వైఖరి గోదావరి వరద బాధిత గ్రామాల ప్రజలను అనూహ్యమైన రీతిలో ఇబ్బందుల పాలుచేశాయి.
*ఉద్యాన పంటలు నీటిపాలు
వరదొలొచ్చినప్పుడు కష్టాలు తెచ్చే లంక గ్రామాల భూములు వాస్తవానికి అత్యంత సారవంతమైనవి. ఉద్యాన పంటలు అంటే కూరగాయల పెంపకానికి, పళ్ల తోటలకు ఇవి పేరెన్నికగన్నవి. మంచి దిగుబడి కోసం ఈ గోదావరి గ్రామాల రైతులు పెట్టబడులు కూడా బాగానే పెట్టి ఉద్యాన పంటలు సాగు చేస్తారు. ప్రస్తుత వరదల కారణంగా పళ్ల తోటలు, కూరగాయలు సాగవుతున్న పొలాలు నీటి పాలయ్యాయి. ఉద్యాన పంటల సాగుకు రైతులు అప్పూసప్పూ చేసి లక్షలాది రూపాయలు ఖర్చుచేశారు. వరదల పుణ్యమా అని రైతుల సొమ్ము నీట మునిగినట్టయింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప లంక గ్రామాల ఉద్యాన పంటల రైతులు మళ్లీ సాగు చేయడం కష్టం. ఈ గ్రామాల్లో రైతులు అరటి, బొప్పాయి, ఇంకా ఇతర పంటలు ఎకరాకు 50 వేల నుంచి 70 వేల రూపాయల వరకూ పెట్టుబడితో సాగు చేస్తారు. సొంత భూములు లేని రైతులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50 వేలకు కౌలు తీసుకుని అంత కన్నా ఎక్కువ మొత్తం పెట్టుబడితో పంటలు వేశారు. ఇంతకు ముందు రెండేళ్లు అంటే 2020, 2021లో కరోనా ప్రభావం వల్ల రైతులు, కౌలు రైతులు పళ్ల తోటలు వేసి భారీగా నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పోరాడుతున్న రైతులను గోదావరి వరదలు చావుదెబ్బ దీశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పక్వానికి రాని దిగుబడిని అమ్మడానికి వెళ్లిన రైతులను వ్యాపారులు తక్కువ ధరతో నష్టపెట్టారు. అనుకోని వరదల వల్ల ఉద్యాన పంటల రైతులు ఎకరాకు సగటున రూ.50 నుంచి రూ.75 వేల వరకూ నష్టపోయారని అంచనా. తక్కువ పెట్టుబడి అనుకునే మొక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. మొత్తంమీద వర్షాకాలంలో గోదావరి వరదలకు తగినంత సన్నద్ధతతో లేని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు గుండెకోత మిగిల్చింది.