మార్చి నుంచి పాత రూ. 100 నోట్లు రద్దు.?కేంద్రం క్లారిటీ..

పాత రూ. 100, రూ. 10, రూ. 5 కరెన్సీ నోట్లు మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి చెల్లవని.. వాటిని ఉపసంహరించుకోవాలని RBI యోచిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తలపై తాజాగా కేంద్రం స్పందించింది. తమ వద్దకు అలాంటి ప్రతిపాదనలు ఏవీ రాలేదని.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది.

”నెట్టింట్లో వచ్చే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ వట్టి పుకార్లే. పాత వంద నోట్లు, రూ. 10, రూ. 5 నోట్లకు సంబంధించి ఆర్బీఐ(RBI) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని” తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దు అని సూచించింది. కాగా, గతంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) మహేష్.. పాత రూ. 100, రూ. 10, రూ. 5 నోట్లను రద్దు చేసే యోచనలో RBI ఉన్నట్లు వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ఆ వార్త సంచలన సృష్టించింది. తాజాగా కేంద్రం వివరణ ఇవ్వడంతో సామాన్యులకు ఊరట లభించింది.