ప్రయాణికులకు నరకం చూపించిన సిద్ధం సభ: ఆళ్ళ హరి

బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ తలపెట్టిన సిద్ధం బహిరంగ సభ ప్రయాణికులకు నరకం చూపించిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండులో బస్సులు దొరక్క ప్రయాణికులు పడుతున్న కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సిద్ధం సభకు పల్లెవెలుగుతో పాటూ ప్రైవేట్ బస్సులనూ వేలాదిగా తరలించటంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మూడురోజులు పాటూ వరుస సెలవులు రావటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు తిరుగుప్రయాణంలో నానా అగచాట్లు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సభలకి మాత్రం ఒక్క బస్సుని కూడా ఇవ్వటానికి ఒప్పుకోని ఆర్టీసీ అధికార పార్టీకి మాత్రం జీ హుజూర్ అంటూ మొత్తం బస్సులను కేటాయించడం దుర్మార్గమన్నారు. ఆర్టీసీ సంస్థ వైసీపీ జేబు సంస్థగా మారిందని విమర్శించారు. సభకు రావటానికి జనాలు సిద్ధంగా లేకపోయినా పదిమందికి ఒక బస్సుని కేటాయించి తోలారన్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన వారే సమస్యల్ని సృష్టిస్తే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. ఇంతా చేసినా సిద్ధం జనాలు లేక వెలవెలపోయిందని ఆళ్ళ హరి దుయ్యబట్టారు.