వైయస్సార్ విగ్రహాన్ని పాత స్థలంలోనే ఏర్పాటు చేయాలి

  • మెయిన్ రోడ్డు పై అదనపు స్థలంలో భారీ కట్టడాన్ని నిరసించిన జనసేన పార్టీ నాయకులు
  • రద్దీ జంక్షన్లో మెయిన్ రోడ్డు ఆక్రమణ సరికాదన్న జనసైనికులు
  • కళ్ళకు గంతలు కట్టి అధికారుల గుడ్డితనాన్ని ప్రశ్నించిన వైనం
  • వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు స్థల విషయమై ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో పాత స్థలంలోనే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. మెయిన్ రోడ్డు పై అదనపు స్థలంలో భారీ కట్టడాన్ని నిరసిస్తూ బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, వంగల దాలి నాయుడు, చిట్లు గణేశ్వరరావు, ఖాతా విశ్వేశ్వరరావు, కర్రి మణికంఠ, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కొల్లి వెంకటరావు, గార జె ఎల్ డీ ఐ రావు, పల్లెం రాజా, కేశవ, దుర్గా ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుందని తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయన్నారు. అటువంటి చోట మెయిన్ రోడ్డు పై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడం వలన భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తాము విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కాకపోతే గతంలో విగ్రహానికి ఎంత స్థలం అయితే ఉండేదో అంత స్థలంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ఏమాత్రం పేదలు చిన్నపాటి కట్టడం చేసిన వారిపై విరుచుకుపడే మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు పట్టణ మెయిన్ రోడ్డులో రద్దీ జంక్షన్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం జరుగుతుంటే అంధులుగా ఉన్నారని, వారు కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురంలో పట్టణ మెయిన్ రోడ్ కి ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే సంబంధిత అధికారులు వాటిపై చర్యలు తీసుకోకపోవడం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలపై విరుచుకుపడే అధికారులు, పెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పట్టణ మెయిన్ రోడ్డు ఆక్రమణ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు స్థల విషయమై సంబంధిత ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు, మున్సిపల్ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.