ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలంటూ సుప్రీం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ టవర్స్ లో 900కు పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. 2014 ఏప్రిల్ లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.

 ఈ టవర్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. మూడు నెలల్లోగా కూల్చివేతలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ టవర్లను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ఇందులో ప్లాట్లు కొన్నవారికి 12 శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణంలో ప్రమాణాలను పాటించలేదని, నిబంధనలను కూడా ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన గ్యాప్ లేదని చెప్పింది. టవర్లలో నివసించే వారి రక్షణ తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.