గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా గ్రామ,వార్డు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. వైస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని ప్రభుత్వం సూచించింది. ప్రతి నెలా 1 నుంచి 16 వరకు ఆయా జిల్లాల పరిధిలోని వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ జాయింట్‌ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 5,154 గ్రామ వాలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

35 ఏళ్లు నిండిన గ్రామ,వార్డు వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తోందని జరుగుతున్నప్రచారంలో నిజం లేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని తొలగించడానికి చర్యలు చేపట్టగా… దాన్ని మొత్తం వాలంటీర్ వ్యవస్థకు ఆపాదించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించట్లేదని తెలిపారు.