ఏపీకి సినీ ఇండస్ట్రీ.. రాకపోతే హీరోల ఇళ్లు ముట్టడిస్తాం..!

మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఏపీ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ. అలాగే ఫిలింసిటీ, స్టూడియోలను రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించాలని కోరింది. విభజన హామీల సాధన కోసం సినిమా ఇండస్ట్రీ… యువజన విద్యార్థి సంఘాలతో కలిసి రావాలని అన్నారు జేఏసీ చైర్మన్ కృష్ణ. ఇండస్ట్రీ తెలుగు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కాకుండా.. కేవలం హైదరాబాద్, తెలంగాణకు మాత్రమే లాభం చకర్చేలా కృషి చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయని.. అలాగే జనాభా కూడా ఎక్కువేనని గుర్తు చేశారు. హీరోలు, హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులు ఆంధ్రప్రదేశ్ వారే ఎక్కువ ఉన్నారని.. వారి సొంత ప్రాంతాలను పట్టించుకోకుండా… హైదరాబాద్ ని అభివృద్ధి చేయడం కరెక్ట్ కాదన్నారు. సినీ ప్రముఖుల పెట్టుబడులన్నీ హైదరాబాద్ లో పెట్టి.. సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్ర, రాయలసీమ కథలు, యాస, భాష, ఫ్యాక్షన్ పేరుతో సినిమాలు తీసి వేల కోట్లు సంపాదిస్తూ పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తున్నారని అన్నారు జేఏసీ చైర్మన్ కృష్ణ. ఏపీలో ‘మా’ బిల్డింగ్, స్టూడియోలు, ఫిలింసిటీ నిర్మించకపోతే హీరోలు, దర్శక, నిర్మాతల ఇళ్లు ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే ఎటువంటి షూటింగులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.