కాంపౌండర్ రాకేష్ మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలి: మలగా రమేష్

  • చనిపోయి మూడు నెలలు గడుస్తున్న ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు….?
  • ఒంగోలు బండ్లమిట్ట నివాసి దేవరకొండ మణికంఠ రాకేష్ మరణానికి కారుకులెవరు…?
  • జనసేన నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేష్
  • ఎస్పీ స్పందనలో బాధితులతో కలిసి ఫిర్యాదు

ఒంగోలు: స్థానిక విజయ హాస్పిటల్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న దేవరకొండ మణికంఠ రాకేష్ చనిపోయి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టు రాలేదని అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఒంగోలు నగర కార్పొరేటర్ మలగా రమేష్ డిమాండ్ చేశారు. ఎస్పీ స్పందన కార్యక్రమంలో మణికంఠ రాకేష్ మృతిపై పలు అనుమానాలను వెల్లడిస్తూ సోమవారం మణికంఠ రాకేష్ బంధువులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మలగా రమేష్ మాట్లాడుతూ.. ఒంగోలు బండ్లమిట్ట సెంటర్ కు చెందిన దేవరకొండ మణికంఠ రాకేష్ కు 2022 సెప్టెంబర్ 3వ తేదీన విజయ హాస్పిటల్ నుండి రాత్రి సమయంలో అర్జెంటు కేసు వచ్చిందని వెంటనే రావాలని ఫోన్ వచ్చిందన్నారు. అప్పుడు వెళ్ళిన రాకేష్ నాలుగో తేదీ సాయంత్రం వరకు రాలేదన్నారు. నాలుగో తేదీ సాయంత్రం రాకేష్ కు అనారోగ్యంగా ఉందని అమృత హార్ట్ హాస్పిటల్లో చేర్పించామని వెంటనే రావాలని ఫోన్ వచ్చిందన్నారు. రాకేష్ బంధువులు అమృత హాస్పిటల్ వద్దకు వెళ్లే సమయానికి రాకేష్ మృతదేహాన్ని స్ట్రక్చర్ పై పెట్టి హాస్పిటల్ బయట ఉంచారన్నారు. వెంటనే కేసు పెట్టడం జరిగిందని, అయితే పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నారు. రాకేష్ మృతి పై తమకు పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాకేష్ మృతదేహంపై పలు గాయాలు ఉన్నాయని, హాస్పటల్ యాజమాన్యంపై తమకు అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి పోస్టుమార్టం రిపోర్టు తెప్పించి కేసును చేదించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ మల్లిక గర్గ్ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని దోషులను త్వరలో శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయిని రమేష్, అల్లా ప్రమీల, గోవిందు కోమలి, ఆకుపాటి ఉష, బ్రహ్మనాయుడు, పోకల నరేంద్ర, భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.