టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే పోలింగ్‌ శాతం తగ్గింది

నిన్న జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా పడిపోయింది. అయితే.. టీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల అధికారుల వైఫల్యం కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ… ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసి, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసి… ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తగిన మార్పులు, చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరి చేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌లలో కోవిడ్ నిబంధనలు కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ సర్కార్ కుట్ర పూర్వకంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.