వైసీపీ ప్రభుత్వం యువత భవితను నాశనం చేసింది

•సంక్షేమం.. సంక్షేమం అంటూ అభివృద్ధిని మరచింది
•రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసింది
•జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేక స్థానం
•జనసేన పార్టీ ఓ సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుంది
•దావోస్ వెళ్లి ఫోటోలకు ఫోజిలిస్తే పెట్టుబడులు రావు
•హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంటే.. ఏపీలో రోజు రోజుకీ దిగజారుతోంది
•శ్రీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎంత మందికి ఉపాధి కల్పించారు?
•శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానంతోనే పెట్టుబడులు సాధ్యం
•జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం.. సంక్షేమం అంటూ అభివృద్ధిని మరచిందని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఒక సరికొత్త ఐటీ పాలసీతో ముందుకు వస్తుందనీ, అది రాష్ట్ర అభివృద్ధికీ, ఐటీ రంగ విస్తరణకీ ఉపయోగపడుతుందని తెలిపారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తామని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా జనసేన పార్టీ ఐటీ పాలసీ ఉంటుందని చెప్పారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఐటీలో హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే- మన పాలకులు అలా ఎందుకు పని చేయలేకపోతున్నారని బాధ కలుగుతుందన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. పార్టీ ఐటీ విభాగం ఛైర్మన్ శ్రీ మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం సమన్వయకర్తలు, ఐటీ వాలంటీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది ఐటీ రంగం. దేశం గర్వించే స్థాయిలో మన తెలుగు వారు దేశ విదేశాల్లో పని చేస్తున్నారు. మనకు యువ శక్తితో కూడిన వ్యవస్థ ఉంది. రాబోయే రోజుల్లో దేశంలో ఐటీ రంగంలో 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయన్నది ఒక అంచనా. మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే రోజు రోజుకీ దిగజారుతున్నాయి. హైదరాబాద్ ఐటీ రంగానికి కేంద్రంగా మారింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాయి. అమరావతి సహా ఏ నగరంలోనూ పెట్టుబడులు పెట్టడానికి తగిన సౌకర్యాలు కల్పించలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. ఐటీ పాలసీ అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టడం కాదు. దావోస్ వెళ్లి ఫోటోలు దిగి వచ్చినంత మాత్రాన పెట్టుబడులు రావు. పెట్టుబడులు రావడానికి తగిన సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలి. ఐటీ పాలసీ అంటే రాష్ట్రానికి సుదీర్ఘ ప్రయోజనాలు చేకూరే విధంగా ఒక విధానానికి రూపకల్పన చేయాలి.
•ఫోటోలకే పరిమితం అయితే పెట్టుబడులు రావు
ఈ ముఖ్యమంత్రికి జనసేన పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయి. ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఎలా పెట్టుబడులు పెడతారు. ప్రతిభ ఆధారిత పెట్టుబడులు అవి. కేవలం ఫోటోలకి పరిమితమై.. ఒక పర్యటనకు వెళ్లి వచ్చి అద్భుతంగా పెట్టుబడులు వస్తాయనుకుంటే అది పొరబాటే అవుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిలా ఆలోచిస్తే తప్పకుండా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలి. దానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. మూడేళ్ల క్రితమే ఈ అంశం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. ఎంఎస్ఎంఈ, ఐటీ పాలసీలపై విధానాలు రూపొందించాం. రాష్ట్రంలో వనరులు ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. జనసేన పార్టీ ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తుంది.
•శ్రీ పవన్ కళ్యాణ్ యాత్ర లోపు మండల స్థాయి ఐటీ కో ఆర్డినేటర్లు
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ప్రతికూల పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయన పడిన కష్టాన్ని అంతా గుర్తుంచుకోవాలి. ఈ రోజు 130 నియోజకవర్గాల్లో ఐటీ కో ఆర్డినేటర్లను నియమించుకోగలిగాం. జిల్లాలకు ఐటీ కో ఆర్డినేటర్లు నియామకం పూర్తయ్యింది. అక్టోబర్ 5వ తేదీ రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మకంగా నిలిచే విధంగా ప్రారంభం కానున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాత్ర నాటికి రాష్ట్రవ్యాప్తంగా 670 మండలాలకు ఐటీ కో ఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయాలి. మనమంతా ప్రజల కోసం సుధీర్ఘ ప్రయాణానికి సిద్ధపడి వచ్చాం. రాబోయే ఎన్నికలకు సిద్ధపడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై దృష్టి సారించాలి.
•లక్ష మంది ఐటీ వాలంటీర్స్ మన లక్ష్యం
ప్రస్తుతం 14 వేల మంది ఐటీ వాలంటీర్స్ ఈ మెయిల్స్ ద్వారా జనసేన పార్టీకి రిజిస్టర్ అయ్యారు. విదేశాల్లో ఉన్న వారు రాత్రిళ్లు పార్టీకి ఉపయోగపడే విధంగా పని చేస్తున్నారు. వారు ఏ పార్టీ కార్యక్రమానికీ రాకపోవచ్చు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవకపోవచ్చు.. అయినప్పటికీ రాజకీయాల్లో ఒక మార్పు రావాలన్న తపనతో వారంతా పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బృందం లక్ష మంది అయ్యేలా చక్కటి ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.
•ఐటీ విభాగం బలమైన శక్తిగా ఎదగాలి
ఐటీ విభాగంగా పార్టీకి మీరు ఏ విధంగా మద్దతు తెలపాలన్న అంశాలు తెలుసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దాన్ని ఓ నినాదంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన క్యాంపెయిన్ తరహాలో చక్కటి క్యాంపెయిన్ తో ముందుకు వెళ్లండి. ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేయాలన్న విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ఐటీ విభాగం దీన్ని ఒక డ్యూటీలా క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలి. బూత్ ల వారిగా దీనిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలి. పార్టీపరంగా జరిగే ప్రతి కార్యక్రమంలో ఐటీ విభాగం తరఫున పాల్గొనాలి. పార్టీకి మీరంతా ఒక బలమైన శక్తిగా ఎదగాలి. అక్టోబర్ 5వ తేదీ నుంచి కనీవినీ ఎరుగని రీతిలో తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించబోతున్నాం. ఎన్ని అవమానాలు ఎదురైనా రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీకి ఐటీ విభాగం చేస్తున్న కృషిని గ్రహించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐటీ విభాగం ఆధ్వర్యంలో అస్త్ర యాప్ తీసుకురాబోతున్నారు. ఎవరు ఏ కార్యక్రమం చేసినా అది పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే ఉండాలి. కొంత మంది తెలియక సొంత యాప్స్ అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మీరు కేవలం పార్టీ ఆలోచనల మీదే దృష్టి పెట్టండి అది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది.దేశంలో మొట్టమొదటి సారి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీసుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న రూ. 5 లక్షల చెక్కు వారి ఇంటికి తీసుకువెళ్లి ఇస్తుంటే అది చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమం తీసుకువచ్చి కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 5 కోట్ల సొంత నిధులు ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద మనసుతో తమవంతు సాయం అందించారు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 167 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎవరికి భరోసా ఇస్తున్నాడు. సొంత జిల్లా, నియోజకవర్గంలో అంత మంది ఆత్మహత్య చేసుకుంటుంటే వారిని ఏ విధంగా ఆదుకోవాలి? ఇలాంటి అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
•జనసేన విజయంలో ఐటీ విభాగం ప్రత్యేక పాత్ర పోషించాలి
మార్చ్ 14వ తేదీ పార్టీ ఆవిర్భావ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన షణ్ముఖ వ్యూహం అదే మన మ్యానిఫెస్టో. ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోండి. యువతకు ఉపాధి, మహిళలకు భరోసా, వ్యవసాయ, నీటిపారుదల రంగాన్ని ఆదుకునే విధంగా అన్ని రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేసే విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది. జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఎవరైనా కనబడితే రోడ్డు మీద ఆగి వారి గోడు వింటున్నారు. జనవాణి ద్వారా వచ్చిన అర్జీల్లో 2 వేల వరకు ప్రభుత్వానికి పార్టీ తరఫున సమస్యల పరిష్కారం కోసం సమర్పించాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. తదుపరి అధ్యక్షుల వారి రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధం కావాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలి. మనల్ని రెచ్చగొట్టేందుకు కొంత మందికి జీతాలు ఇచ్చి మరీ పెట్టుకున్నారు. పేటీఎం బ్యాచ్ మాదిరి మనం ఎవ్వరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు. ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. మనల్ని ఎవరో విమర్శిస్తున్నారని వారి కోసం మన సమయం వృధా చేసుకోవద్దు. మన ఎనర్జీని ఇతరుల్ని విమర్శించేందుకు వాడవద్దు. రహదారుల మీద అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ చేశాం. అదే విధంగా ముందుకు వెళ్లాలి. పార్టీ విజయంలో ఐటీ విభాగం ప్రత్యేక పాత్ర పోషించాలి” అన్నారు.
పార్టీ ఐటీ విభాగం ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ రాజకీయ పురోభివృద్ధిలో ఐటీ విభాగం తమ వంతు పాత్ర పోషిస్తుంది. పార్టీని అధికరంలోకి తీసుకువచ్చేందుకు క్రియాశీలకంగా పనిచేస్తుంది. పార్టీలోని ఇతర విభాగాలను కో ఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్తుంది. పార్టీ కార్యక్రమాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి అస్త్ర యాప్ ను రూపొందించామ ని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్య, చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీమతి పాలవలస యశస్వి, కోశాధికారి ఎ.వి.రత్నం, జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, షేక్ రియాజ్, చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, కార్యక్రమాల విభాగం కన్వనర్ కళ్యాణం శివశ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.వరప్రసాద్, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *