కార్మికుల సొమ్ములు మాయం చేసిన వైసీపీ ప్రభుత్వం

* కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ.12 వందల కోట్లు ఏం చేశారో జవాబు చెప్పాలి
* కార్మిక ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం
* ఇసుక కొరతను సృష్టించి కార్మికుల కడుపు కొట్టారు
* శ్రమ జీవుల తరుఫున బలంగా పోరాడే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
* విశాఖపట్నంలో మే డే వేడుకల్లో పాల్గొన్న శ్రీ నాదెండ్ల మనోహర్
* భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం


‘కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వైసీపీ సర్కారు దిగమింగింది. కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు దారి మళ్ళించింది. కార్మికులకు కనీస సాయం అందడం లేదు’ అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కార్మిక దినోత్సవం మే డే సందర్బంగా విశాఖపట్నంలో సోమవారం వివిధ కార్యక్రమాల్లో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. గాజువాక దుర్గా నగర్ లో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో శ్రీ మనోహర్ గారు పాల్గొని మే డే జెండా ఎగురవేశారు. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసిపి ప్రభుత్వం నాలుగుసార్లు ఇసుక విధానాన్ని మార్చింది. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టింది. కార్మికులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇష్టానుసారం వాడేసింది. సెస్ రూపంలో జమ అయిన రూ.12 వందల కోట్లు ఎలా మాయం చేశారో కార్మికులకు సమాధానం చెప్పాలి. కార్మిక సంక్షేమ బోర్డును భ్రష్టు పట్టించింది. కార్మికులకు సంబంధించిన పెళ్లి కానుక, ప్రసూతి సమయంలో అందించే డబ్బులను నిలుపుదల చేసింది. కార్మికులు మరణిస్తే అంత్యక్రియలు నిమిత్తం ఇచ్చే రూ. 20వేల సాయాన్ని కూడా ఆపేయడం సిగ్గుచేటు. కార్మికులు ప్రభుత్వం నుంచి సహాయం ఏమి అడగడం లేదు. వారు దాచుకున్న డబ్బులు ఇమ్మని అడుగుతున్నా సమాధానం లేదు. నవరత్నాల పేరుతో కార్మికుల డబ్బులను పక్కదారి పట్టించిన వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో చూపింది.
* కార్మికుల తరఫున నిజాయతీగా పోరాడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇసుక విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళింది. ఫలితంగా ఇసుకలో అవినీతి రాజ్యమేలింది. కనీసం దానిని నిలువరించే పనులు వైసీపీ చేయలేదు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టింది. ఇసుక దెబ్బకు పనులు లేక పస్తులు ఉన్న భవన నిర్మాణ కార్మికుల తరఫున నిజాయతీగా నిలబడిన నాయకుడు పోరాడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నంలో జరిపిన లాంగ్ మార్చ్ కార్మిక పోరాటాల్లో చిర స్థాయిగా నిలిచిపోతుంది. కార్మిక సమస్యలు తీర్చాలానే నిబద్ధత పవన్ కళ్యాణ్ గారికి తప్ప మరెవరికి లేదు. కేవలం వారి గురించి పోరాడమే కాదు… కష్టాల్లో ఉన్న కార్మికుల కడుపు నింపాలని శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను జనసేన పార్టీ సమర్థంగా నిర్వహించింది. రాష్ట్రంలోని కార్మికుల కడుపు నింపే ఆలోచన చేశాం. గతంలో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే, రూ.5 లక్షల ప్రమాద బీమా సొమ్ము బాధిత కుటుంబానికి ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం రూ. లక్ష మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారికి న్యాయంగా రావలసిన పరిహారం అందడం లేదు. రూ.100 లు ప్రమాద బీమా కోసం కడుతున్న డబ్బులు ఏమవుతున్నాయి? కార్మికులకు అందాల్సిన ప్రతి రూపాయిని వారికి అందేలా చూడటమే జనసేన లక్ష్యం. కచ్చితంగా కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తాం” అన్నారు. కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ , జనసేన నాయకులు శ్రీ పీవీఎస్ఎన్ రాజు, శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి అంగ ప్రశాంతి, శ్రీ గడసాల అప్పారావు, శ్రీమతి పి. ఉషా కిరణ్, శ్రీ తిప్పల రమణారెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు శ్రీ అప్పారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ సహదేవరావు, శ్రీకనకారావు తదితరులు పాల్గొన్నారు.
* కార్మికులతో కలిసి భోజనం
మే డే సందర్భంగా కార్మికుల సమస్యలు తెలుసుకోవడమే కాక వారితో కలిసి శ్రీ మనోహర్ గారు భోజనం చేశారు. వారితో ముచ్చటిస్తూ ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల మీద ఆరా తీశారు.
* కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందజేత
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇండస్ట్రియల్ బెల్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా అందజేశారు. కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా జనసేన పార్టీ కార్మిక లోకానికి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.