ఇవేం నిర్మాణాలు మహాప్రభో!

* పేదలందరికీ ఇళ్ల పేరిట గారడీ
* జగన్ పాలనలో ఎటుచూస్తే అటు బురిడీ

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం వ్యవహారమంటే ఏమిటి? ముందు ఆశపెట్టి, ఆటు తర్వాత వట్టి చేతులు చూపడం! ఇందులో జగన్ ప్రభుత్వం రాటుదేలింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అంటూ పథకాన్ని ఎన్నికల సమయంలోనే ప్రకటించారాయన. తాను ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీ, ఆసరా, అమ్మఒడి, రైతుభరోసా, పింఛన్ల పెంపు, జలయజ్ఞం, మద్యనిషేధం, ఫీజులు తిరిగి చెల్లింపు తోపాటు ప్రజలకు గృహవసతీ కలిగిస్తామన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో లక్షల ఇళ్లను సాకారం చేస్తామని హామీ అయితే ఇచ్చారు. అధికార పీఠం ఎక్కాక మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘దేశంలో ‘ మరెక్కడా . కనివినీ ఎరుగని విధంగా 30 లక్షల గృహాలు’ తన లక్ష్యమని బహిరంగ సభల్లో ఢంకా బజాయించారు. పదవిలోకి వచ్చిన ఏడాదికల్లా (2020) కొన్ని ఇళ్లపట్టాలను ఇచ్చిన ఆయన, అనంతరకాలంలో జగనన్న లేఔట్లను తెరపైకి తెచ్చారు. తన పేరిట నిర్మించే కాలనీల్లో పేదలందరికీ నివాస వసతి తథ్యమన్నారు కానీ, ఇప్పుడది మిఠాయి పొట్లం వ్యవహారంగా తయారైంది!
*అన్నీ మాటల మూటలే!
ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ వాగ్దానాలు ఇన్నీ అన్నీ కావు. లేఔట్లలో స్థలమిస్తాం, ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం చేస్తాం, సొంతగా కట్టుకోలేని వారికి అండదండగా ఉంటాం, ఇంటి బాధ్యత మొత్తం మాపైనే పెడితే సంతోషంగా స్వీకరిస్తాం అని తీపి మాటల మూటల్ని మటుకు పంచిపెట్టారు. పనిలో పనిగా మూడు ఆప్షన్లు ప్రవేశపెట్టారు. తొలి ఆప్షన్ ప్రకారం లబ్ధిదారుల కోరిక మేర ఇంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే అందిస్తుంది. తాను ఇచ్చిన నమూనా అనుసరించి వారు ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. కూలీలకయ్యే ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తుంది. రెండో ఆప్షన్ ఎంచుకున్నవారు నిర్మాణ సామగ్రిని తామే తెచ్చుకుంటామంటే నచ్చిన చోట వాటిని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే, ఆ పనుల స్థితిని బట్టి ప్రభుత్వమే డబ్బులిస్తుంది. ఇక మూడో ఆప్షన్ కు సంబంధించి, ఇంటి నిర్మాణానికి సమస్త బాధ్యతా ప్రభుత్వానిదే! సాక్షాత్తూ సీఎం హామీ లభించడంతో, ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది దీన్నే ఎంచుకున్నారు. కానీ 2020-2023 …. మూడేళ్ల మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం మూడో ఆప్షన్ కింద కట్టించి ఇచ్చిన ఇళ్లు కేవలం 11 వేలు!
*పేదల కలలన్నీ కల్లలు
రాష్ట్రమంతటా 15 వేలు ఉన్న జగనన్న లేఔట్లలో గేటెడ్ కమ్యూనిటీల స్థాయిలో కాలనీలు కట్టిస్తామన్నది జగన్ భరోసా. ప్రతిష్టాత్మక పథకమంటూ తెగ ప్రచారం చేసుకోవడం తప్ప, పనులు స్వల్పం. మూడో ఆప్షన్లో కట్టాల్సినవి మూడున్నర లక్షల ఇళ్లయితే, ఇన్నేళ్లలో కట్టినవి పదకొండు వేలు అంటే అత్యంత తక్కువ. ‘ముచ్చట’గా మూడు శాతం! ఫలితంగా దాదాపు అందరూ ఉస్సూరుమంటున్నారు. తమ సొంతింటి కలను ప్రభుత్వమే కల్ల చేసిందంటున్నారు. యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. పనుల్ని గాలికొదిలేసింది. సమీక్షలకు స్వస్తి పలికేసింది. ఆప్షన్ 1,2లను ఎంచుకున్నవారు మూడేళ్లూ నానాపాట్లు పడ్డారు. అప్పులపాలైపోయారు. ఇంటిని నిర్మించుకున్నామన్న సంతోషం కూడా వారిలో ఏ కోశానా లేదు. మరోవైపు జగన్ ప్రభుత్వతీరు గోరుచుట్టుమీద రోకటిపోటులా దాపురించింది. మాటల నసే తప్ప చేతల పసలేని యంత్రాంగం ఆయా లబ్ధిదారులతో ఉమ్మడి గృహప్రవేశాలు చేయించాలని చూస్తోంది. ఇళ్ల నిర్మాణాలన్నీ ప్రభుత్వ ఘనకార్యాలనేలా ప్రచారం చేసుకుంటోంది. ఇది సర్వత్రా తీవ్ర నిరసనలకు దారితీస్తోంది.
*చేతులెత్తేసిన ప్రభుత
మూడో ఆప్షన్ కింద గృహనిర్మాణాలకు బిల్లుల మొత్తాలను ప్రభుత్వం సకాలంలో ఇవ్వడంలేదని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. అసలే నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపుగా పెరిగిపోయాయని ఆక్రోశం వ్యక్తపరుస్తున్నారు. ఆప్షన్ 3 గృహాల మాటేమిటన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఏ విధమైన సమాధానమూ లేదు. వైకాపా ప్రభుత్వం నమ్మించి వంచించిందని లబ్ధిదారులు, గుత్తేదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మూడో ఆప్షన్ ఎంచుకున్న వారి సంఖ్య 3,47,686. ఒక్కో ఇంటి నిర్మాణానికి నిర్దేశించిన వ్యయం రూ.2.15 లక్షలు. దీనిలో రూ. లక్షా యాభై వేలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. అదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. తన వాటా నిధి రూ.30 వేలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కేంద్రం తనకు విడుదల చేసిన నిధులనే ఇళ్ల లబ్ధిదారుల పనిదినాలకు చెల్లిస్తోంది. మొత్తం రూ.2.15 లక్షల్లో కేంద్రం రాయితీ రూ.1.5 లక్షలు, రాష్ట్రవాటా రూ. 30 వేలు పోను మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుల వాటా కింద రాష్ట్ర ప్రభుత్వమే రుణంగా ఇప్పిస్తుంది. దీని కోసం బ్యాంకుతో ఒప్పందం చేసుకుని, లబ్ధిదారుల పేరిట ప్రారంభించే ఖాతాల్లో జమ చేస్తోంది. ఆ రుణ మొత్తాన్ని వారి సమ్మతితో కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారు. అలా ఇంతవరకు ఆప్షన్ 3 కింద 3,39,512 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను జిల్లాలవారీగా కాంట్రాక్టర్లకు అప్పగించారు. అందులో ఇప్పటికే 1,76,779 మంది లబ్ధిదారులతో ఒప్పందాలయ్యాయి. ఇంకా 1,62,733 మందితో కావాల్సి ఉంది. రుణాల మంజూరీకి 3,21,418 మంది బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. మరో 18 వేలకు పైగా ప్రారంభించాల్సి ఉంటుంది.
*దయనీయం… పెను భారం
గత మూడేళ్లలోనూ ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు అధికంగా పెరిగి పెనుభారంగా తయారయ్యాయని కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. ఏపీ ప్రభుత్వం రూ. 2.15 లక్షల వంతున ఇచ్చేవి ఇప్పుడు ఎంత మాత్రమూ చాలవని వారంటున్నారు. ఇటువంటి దయనీయ స్థితిగతుల్లో ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం ఎలా సాగుతుందన్నదే కీలక ప్రశ్న. జిల్లాల వారీగా చూస్తే, మూడు చోట్ల (అనకాపల్లి, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో) ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు జగన్ ప్రభుత్వం! సీఎం సొంత జిల్లా కడపలో దరఖాస్తుదారులు 17,188 మంది కాగా, నిర్మించిన ఇళ్లు 47 మాత్రమే. విశాఖలో అయితే 1,02,887 ఇళ్లకుగాను కట్టింది 55 ఇళ్లనే. కాకినాడలో 11,463కి గాను పూర్తయిన ఇళ్లు కేవలం 13. రాష్ట్రంలో 8,353 ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పునాదుల దశ కూడా దాటనివి 69,582 ఇళ్లు. మరో లక్ష ఇళ్ల నిర్మాణ పనులు పునాదులలోనే ఉన్నాయి. మిగిలినవి ఇంకొంచెం ముందుకు సాగాయి. ఇదీ జగన్ పాలనలో ‘పేదలందరికీ ఇళ్లు’ తీరు!