ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీ పెద్దల కీలక సమావేశం..

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా పాల్గొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నందుకు గానూ భాజపా కార్యకర్తలందరి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ సీనియర్‌ నేతలు సత్కరించారు.

భాజపా కార్యవర్గ సమావేశంలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో కరోనా పరిస్థితులు ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ అరుణ్ సింగ్‌ వెల్లడించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతోన్న ఈ మేధోమథన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా హాజరయ్యారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా భాజపా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ అధినేతలు మాత్రం వర్చుల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. సమావేశం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.