నేడు గురునానక్ జయంతి.. స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు..

గురునానక్ జయంతి మొదటి సిక్కు గురువు గురునానక్ దేవ్ పుట్టినరోజు. ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ జరుపుకుంటారు. గురునానక్ 551వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని హర్మీందర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం)లో సిక్కు భక్తులు సోమవారంనాడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే దేవాలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. విద్యుత్ వెలుగులతో స్వర్ణదేవాలయం వెలుగులీనింది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు.

గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ ఐక్యత, సామరస్యం, సేవామార్గాన్ని చూపించడంతో పాటు, కఠోర శ్రమ, నిజాయితీ, ఆత్మాభిమానంతో కూడిన జీవినవిధానాన్ని ప్రబోధించారని రాష్ట్రపతి తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నారు. గురునానక్ సమాజ సేవే పరమావధిగా ప్రజలను ముందుకు నడిపించారని ప్రధాని తన సందేశంలో గుర్తుచేశారు.