గ్రేటర్ ఫలితాలపై అగ్ర నేతలు అభినందనలు

గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు విడుదల కాగా.. ఈ ఫలితాల్లోఅధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. 48 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ పార్టీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పార్టీకి జనసేన పార్టీ మద్దతు కూడా లభించడంతో మరింత ఓట్ల శాతాన్ని సాధించింది. అయితే ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించినందుకు గానూ ఆ పార్టీ అగ్ర నేతలు అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. జీహెచ్‌ఎంసీ బీజేపీ ఎలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కిషన్‌రెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల పట్ల బీజేపీ శ్రేణులు మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చుతున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షా ఆయన్ను అభినందించారు.

అంతేకాకుండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా అమిత్‌ షా అభినందించారు. గ్రేటర్‌లో బండి సంజయ్‌ అద్భుతంగా కృషి చేశారని అమిత్ షా ట్విటర్‌లో కూడా ప్రశంసించారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కృషిని కూడా అమిత్ షా అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరెడ్‌మెట్‌ డివిజన్‌ మినహా మిగతా 149 డివిజన్లలో లెక్కింపు పూర్తయింది. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.