Ind vs Eng: రెండో రోజు ఆధిపత్యం కోసం టఫ్ ఫైట్..

భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 263/3తో తిరుగులేని స్థితిలో నిలిచి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ జో రూట్ (128 బ్యాటింగ్: 197 బంతుల్లో 14×4, 1×6) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (87: 286 బంతుల్లో 12×4) మంచి ప్రదర్శన చేసి తొలిరోజు చివరి ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. రెండు సెషన్ల పాటు భారత్‌ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కి 200 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పింది. చివరి సెషన్‌ ఆఖర్లో సిబ్లీని బుమ్రా ఔట్ చేయడం ఒక్కటే భారత్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.

చెన్నైలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత జో రూట్ మీడియాతో పలు విషయాలు వెల్లడించాడు. వందో టెస్టులో శతకం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 600-700 పరుగులు చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. భారీ స్కోరుతో టీమ్‌ ఇండియాను చిరాకు పెడతామని చెప్పాడు. రెండో రోజు పూర్తిగా లేదా మూడో రోజు వరకు ఆడితే ఊపు అందుకోవచ్చు. అప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదంటూ చెప్పుకొచ్చాడు.