గోవాలో విషాదం.. 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి

గోవాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో 26 మంది కరోనా రోగులు చనిపోయినట్లు ఆ రాష్‌ర్ట ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే హైకోర్టుకు తెలిపారు. అయితే కరోనా రోగులు మరణించడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేనప్పటికీ, రోగులు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. సోమవారం 1200 జంబో సిలిండర్ల ఆక్సిజన్ అవసరమైనప్పటికీ 400 మాత్రమే సరఫరా చేశారని తెలిపారు.

గోవా మెడికల్ కాలేజీలో కొనసాగుతున్న కరోనా ట్రీట్‌మెంట్‌పై విచారణ చేసేందుకు ముగ్గురు నోడల్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కొరత ఉంటే దాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని సీఎం ప్రమోద్ సావంత్ ఆ కమిటీని ఆదేశించారు. ఇక గోవా మెడికల్ కాలేజీలో వార్డుల వారీగా ఆక్సిజన్‌ను అందించే మెకానిజమ్‌పై చర్చిస్తామని సీఎం తెలిపారు. గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిని సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం సందర్శించి, కరోనా రోగులకు అందుతున్న సేవలను దగ్గరుండి పరిశీలించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు.