లడాఖ్‌లో సైనికులకు అప్‌గ్రేడెడ్ సదుపాయాలు

ఈస్ట్రన్ లడాఖ్‌లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకు అప్‌గ్రేడెడ్ సదుపాయాలను ఏర్పాటు చేసింది భారత సైన్యం. అతిశీతల వాతావరణానికి తగినట్లుగా.. అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వెచ్చగా ఉండే టెంట్లు.. నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా ఉండే విధంగా టెంట్లను నిర్మించారు. సైనికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ నెల తర్వాత సుమారు 40 ఫీట్ల హిమపాతం కురిసే ప్రాంతంలో ఈ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతుంటాయి. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో భారత జవాన్లు ఇక్కడ దేశ రక్షణ కోసం పహారా కాయడం పెను సవాలే. అలాంటి జవాన్ల కోసం వసతిని మెరుగుపరిచింది భారత సైన్యం. ‘శీతాకాలంలో బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు లద్దాఖ్‌ సెక్టార్‌లోని జవాన్లందరికీ వసతి సదుపాయాలను మెరుగుపర్చాం’ అని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్రంట్‌లైన్‌లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్‌ టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.