ఇండియాలో 49 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు.

కరోనా మహమ్మారి గత వారం రోజుల్నించి క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలలో పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి నెమ్మదిగా పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. దేశంలో వ్యాక్సినేషన్ ఇప్పటి వరకూ 49 కోట్ల మైలురాయి దాటింది. ఒక్క జూలై నెలలోనే 13 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ నిల్వ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 3 కోట్లకు పైగా జనం కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 95 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం రోజుకు 41 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2.2 కోట్లమందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా..1.12 కోట్లమందికి సింగిల్ డోస్ పూర్తయింది. మరో 33.79 లక్షలమందికి రెండు డోసులు పూర్తయ్యాయి. దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం కూడా రోజురోజుకూ పెరుగుతోంది.