అభివృద్ధికి ఓటెయ్యండి.. భారతీనగర్‌ ప్రచారంలో హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం భారతీనగర్‌ 111 డివిజన్‌లోని హెచ్‌ఐజీ కాలనీలో కార్పొరేటర్‌ అభ్యర్థి సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హెచ్‌ఐజీ కాలనీకి మిషన్‌భగీరథ నీళ్లు కావాలని కాలనీవాసులు మంత్రిని కోరారు. దీనికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు ఎన్నికలు జరిగిన 40రోజుల్లోనే హెచ్‌ఐజీలో మిషన్‌ భగీరథ పనులను ప్రారంభిస్తామని, కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా మంత్రిగా నేను, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారిమే ఉన్నామని, కార్పొరేటర్‌ అభ్యర్థి కూడా టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని కాలనీ వాసులకు సూచించారు. కాలనీ ప్రజలు బాగా ఆలోచించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి సింధూ ఆదర్శ్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.