ఐపిఎల్‌ 2021కు వార్నర్‌ దూరం.. కారణం అదేనా?

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 2021 సీజన్‌ ఐపిఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదేగనుక జరిగితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తీవ్ర నష్టమే అని చెప్పొచ్చు. ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రెండో వన్డే మ్యాచ్‌లో వార్నర్‌కు గాయమైంది. అయితే, ఆ గాయం నుంచి కోలుకోవడానికి 6 నుంచి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వార్నర్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు చెబుతున్నారు. దీనిపై తాజాగా వార్నర్‌ మాట్లాడుతూ.. కొన్ని వారాలుగా బాల్‌ను త్రో చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేదని, అయితే వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తానని చెప్పాడు.. ప్రస్తుతం వికెట్ల మధ్య పరిగెత్తడమే అసలు సమస్య అని, గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుతం మెరుగైన చికిత్స తీసుకుంటున్నానని, ఈ చికిత్సతో త్వరగా గాయాన్ని అధిగమిస్తానని ఆశిస్తున్నానని చెప్పాడు. ఇదిలా ఉండగా, మరో రెండు నెలల్లో ఐపిఎల్‌ 2021 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వార్నర్‌ కోలుకోవడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందంటే..

ఈ ఐపిఎల్‌ సీజన్‌ మొత్తానికి అతడు దూరం కానున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వార్నర్‌ కెప్టెన్‌గానే కాకుండా.. ప్రధాన ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో వార్నర్‌ దూరమయితే హైదరాబాద్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకశేల వార్నర్‌ దూరమయితే కెన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడు.