భారత్‌కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: పాకిస్థాన్ ప్ర‌క‌ట‌న‌

కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు పొరుగు దేశం పాకిస్థాన్‌ తనవంతు సాయం అందించేందుకు సిద్ధమయింది. భారత్‌కు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ట్విటర్‌లో వెల్లడించారు.

‘కరోనా రెండోదశ ఉద్ధృతితో పోరాటం చేస్తున్న భారత్‌ పట్ల సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగుదేశానికి మావంతు సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా సామగ్రిని త్వరితగతిన భారత్‌కు సరఫరా చేసేలా ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కృషి చేయాలి. అంతేకాకుండా కరోనాపై పోరులో సాయం చేయడానికి ఏవిధమైన మార్గాలు ఉన్నా వాటి కోసం అన్వేషించాలి’ అని ఖురేషి ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తూ శనివారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. భారత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.