భారత్ సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం: చైనా

ఒడుదొడుకులకు గురైన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు భారత విదేశాంగ మంత్రి చేసిన సూచనలను తాము పరిగణనలోకి తీసుకున్నామని శుక్రవారం చైనా వెల్లడించింది. అలాగే బీజింగ్‌తో సంబంధాలకు దిల్లీ ప్రాముఖ్యతనిచ్చిందని, ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నామని తెలిపింది. గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రసంగం గురించి ప్రశ్నించగా.. చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియన్ ఈ విధంగా స్పందించారు.

‘ఆయన భారత్, చైనా సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనాతో సంబంధాలకు భారత్‌ ప్రాముఖ్యతనిస్తుందని ఈ వైఖరి వెల్లడిచేస్తుంది. దాన్ని మేం అభినందిస్తున్నాం. సరిహద్దు సమస్య పూర్తిగా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపడి ఉండకూడదని మేం చెప్పాం’ అని ఝావో సమాధానమిచ్చారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి దారిలో పెట్టేందుకు భారత్ తమతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

గురువారం జైశంకర్ ఓ ఆన్‌లైన్ సమావేశంలో మాట్లాడుతూ..8 సూత్రాలను, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాల్సిన అంశాలను ప్రతిపాదించారు. రెండు దేశాలు ఇప్పుడు కూడలిలో ఉన్నాయని, ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల ప్రభావం ఇరు దేశాలపైనే కాక ప్రపంచం మొత్తంపై ఉంటుందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది జరిగిన పరిణామాల వల్ల ద్వైపాక్షిక బంధంపై ఒత్తిడి పడిందని చెప్పారు. చైనా తన వైఖరిని మార్చుకోవడానికి, సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించడానికి సహేతుక కారణాలను ఇంకా తమకు తెలియజేయలేదని అన్నారు.