*టూరిజం అభివృద్ధి చేస్తే గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..
*పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రతీఒక్కరికీ న్యాయం చేయాలి..
*రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కి వివరించా..
*జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ
వి.ఆర్.పురం, టూరిజం అభివృద్ధికి గిరి బిడ్డల ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం కోసం మరియు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రతీ ఒక్క నిర్వాసితులకు న్యాయం చేయాలని, జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు (పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ) కందుల దుర్గేష్ కి వివరించానని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో గల జిల్లా కార్యాలయంలో కలవడం జరిగిందని, మండలంలో నెలకొన్న సమస్యలపై చర్చించామని వివరించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కు మునిగిపోతున్న ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయమైన పునరావాసం, ఆర్&ఆర్ ఇప్పించి ఆదుకోవాలని కోరామన్నారు. పాపికొండల పర్యాటక అభివృద్ధికి సహాకరించాలని, తద్వారా గిరి బిడ్డలకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు కూటమిప్రభుత్వం ఆదుకోవాలని, కొండరెడ్డి చేతివృత్తులను, బ్రతికించాలని అన్నీ విధాలుగా ఆదుకోవాలని విన్నవించానని చెప్పారు. పర్యాటక శాఖను ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ది చేస్తే శ్రీరామగిరి దేవస్థాన అభివృద్దికి తోడ్పాటు అందిస్తే గిరిజన నిరుపేద కుటుంబాలు ఎంతో స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని సూచించానన్నారు. పర్యాటక మంత్రిగా మండలంలో పోచవరం బోట్ పాయింట్ ను సందర్శించాలని కోరానని వివరించారు. బోటు పాయింట్ వద్ద రాత్రి బసకు సంబంధించి హట్స్ ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలని తద్వారా గిరిజన కొండరెడ్లకు ఉపాధి కలుగుతుందని తెలియజేశానని చెప్పారు. శ్రీరామగిరి దేవస్థానం గుడి వరకు రోడ్డు వేయాలని సూచించానని పేర్కొన్నారు. అన్నవరం బ్రిడ్జి (చఫ్టా) కూలడంతో 40 గ్రామాలకు రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, హైలెవల్ వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరామని వివరించారు. సుమారు 40 గ్రామాల ప్రజల ఇబ్బందులు కూలంకుషంగా చెప్పానన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, మాట్లాడుతూ మండలంలో త్వరలో పర్యటన చేస్తానని, పాపికొండల పర్యాటక మరియు ఇతరసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మండల స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం నాయకులు, జనసైనికులు పాటుపడాలని చెప్పడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కుర్ల రాజశేఖర్ రెడ్డి, రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బోదిరెడ్డి త్రిమూర్తులు, రాజమండ్రి అర్బన్ జనసైనికులు గోవర్ధనం సూర్య నాగేంద్ర, యూత్ నాయకులు లోకేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment