వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌, ఇతర దేశాలకు సాయం చేస్తాం : బైడెన్‌

వాషింగ్టన్‌ : స్వంతంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశాలున్న భారత్‌తో పాటు ఇతర దేశాలకు తాము సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది వ్యాక్సిన్లు అవసరమున్న నేపథ్యంలో… తాము 5 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించేందుకు కట్టుబడి ఉన్నామని విలేకరుల సమావేశంలో బైడెన్‌ అన్నారు. ‘5 కోట్లకు పైగా టీకా మోతాదులను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నార. మరిన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా స్వంతంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశాలున్న భారత్‌ లాంటి దేశాలకు సరైన సామర్థ్యాన్ని అందిస్తాం. అలా సాయం చేయాలనుకుంటున్నాం. అదే చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా ఏమీ ఆశించి చేయడం లేదని, ఎవరిని నుండి ఏమీ వసూలు చేయడం లేదని, ఇటువంటివి సాధ్యమైనంత ఎక్కువ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కోవిడ్‌-19 పోరుపై స్పందిస్తూ… వ్యాక్సిన్‌ ఆయుధ గిడ్డంగా మారేందుకు అమెరికా కట్టుబడి ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఇతర దేశాల వ్యాక్సిన్ల కంటే కోవాక్స్‌కు ఎక్కువగా మద్దతునిచ్చామని తెలిపారు. క్వాడ్‌ భాగస్వామ్య దేశాలైన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా సహకారంతో విదేశాల్లో వ్యాక్సిన్‌ తయారీకి మద్దతునిచ్చామని చెప్పారు.

జూన్‌లో యూరప్‌ పర్యటన సందర్భంగా ఫైజర్‌ నుండి 500 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి.. వ్యాక్సిన్‌ కొనుగోలు చేయలేని అల్పాదాయ దేశాలకు అందిస్తామని ప్రకటించామని, ఈ నెల చివరి నాటికి వాటిని రవాణా చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తమ స్వంత ఉత్పత్తికి చెందిన మరో 80 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లను అందిస్తానని హామీ ఇచ్చానని,, ఇప్పటికే అది ప్రారంభమైందని తెలిపారు.