డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం

• రాష్ట్ర యువశక్తిని వికసిత్ భారత్ లో అంతర్భాగం చేస్తాం
• రిఫార్మ్, పెర్ఫార్మ్ , ట్రాన్స్ఫార్మ్ సూత్రంతో దూసుకెళ్తాం
• వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ తిరోగమనం… అప్పులు చేసి, అభివృద్ధి మరిచిపోయారు
• వైసీపీ హయాంలో అవినీతి 100 శాతం.. అభివృద్ధి 0 శాతం
• అవినీతిపరులు దోచుకున్న సొమ్మును రికవరీ చేసే చట్టం తెస్తాం
• పోలవరం, మూడు రాజధానుల పేరుతో వైసీపీ కాలక్షేపం
• రాజమహేంద్రవరం ఎన్టీయే కూటమి ఎన్నికల సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

‘ప్రజోపయోగం, ప్రజా క్షేమం పట్టని వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అవినీతి 100 శాతం జరిగితే, రాష్ట్ర అభివృద్ధి సున్నాగా మిగిలిపోయింది. ఇసుక, మద్యం, సహజవనరుల దోపిడీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం అయింద’ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు. అన్ని రంగాలు, అన్ని వర్గాలు వైసీపీ పాలనలో నష్టపోయాయని, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచేసిందన్నారు. అభివృద్ధిని దూరం చేసి, ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టేలా వైసీపీ పాలన సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను తిరోగమనం పట్టించిన వైసీపీ పాలన నుంచి బయటపడేయడానికి ఎన్టీయే ప్రభుత్వం రావాలని చెప్పారు. సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్టీయే కూటమి ఎన్నికల ప్రచారసభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ గారు మాట్లాడుతూ “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించింది. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రాన్ని పురోగమన దిశగా తీసుకెళ్లి, రాష్ట్రాన్ని బ్రాండ్ గా చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2019లో మొదలైన వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనుకబడింది. ప్రగతి రథం పట్టాలు తప్పింది. ఒక్కో రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చివరకు రాష్ట్రానికి అప్పులు తప్ప ఏమీ మిగల్లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని వెనక్కు నెట్టారు. ప్రజల బాగు పట్టించుకోకుండా, వారికి శాశ్వత సాంత్వన కలిగించకుండా పాలన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్నో పథకాలను పక్కదారి పట్టించారు. కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో పనులు రాష్ట్ర సహకారం లేక మధ్యలోనే ఆగిపోయాయి. ఇవన్నీ మళ్లీ ప్రారంభం కావాలంటే ఎన్టీయే సర్కారు కావాలి. కేంద్రంలో ఇప్పటికే కాంగ్రెస్ తన అపజయాన్ని ఒప్పుకుంది. ఎన్టీయే కు ఈసారి భారీ మెజారిటీ ఇచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ వెలుగులు సాధ్యమవుతాయి.
• యువశక్తిని నిర్వీర్యం చేశారు
ఆంధ్రప్రదేశ్ యువత ఒకప్పుడు దేశానికి స్ఫూర్తివంతంగా ఉండేవారు. వారిలోని అపర మేధ, ప్రతిభ ప్రపంచాన్ని జయించేలా చేసింది. సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన దశలో ఇక్కడ యువత కాలంతో పాటు ముందుకు సాగి, ఎన్నో విజయాలు అందుకున్నారు. గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత శక్తిని నిర్వీర్యం చేశారు. ఇక్కడున్న యువతను కాస్త ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు జరిగేవి. అయితే వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కనపెట్టి యువతకు కనీస ప్రోత్సాహం కూడా ఇవ్వలేకపోయింది. వికసిత భారత్ గా దేశం వేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ యువత కూడా దానిలో భాగస్వామ్యం కావాలనేది నా కల. దీనికోసం యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. వారి అభిరుచిని బట్టి, తగిన విధంగా ప్రోత్సహించడం అనేది అవసరం. ఇది ఎన్టీయే ప్రభుత్వంలో ప్రాధాన్య అంశంగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వేగవంత అభివృద్ధిలో ఎన్టీయే బాధ్యత తీసుకుంటుంది.
• పోలవరాన్ని పట్టించుకోలేదు… మూడు రాజధానులంటూ మోసం చేశారు
వైసీపీ హయాంలో పోలవరాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. పునరావాసం ఊసే లేదు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం పోలవరం పునరావాసాన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కు సాగు, తాగునీరు సమృద్ధిగా అందజేసే గొప్ప ప్రాజెక్టును నిర్మించలేకపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రైతాంగం సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండే ఆంధ్రప్రదేశ్ లోని రైతులంతా ఇప్పుడు కనీస గిట్టుబాటు ధర లేక, పంటలు పండించేందుకు వెనకడుగు వేయడం బాధిస్తోంది. ఎన్టీయే పాలన వస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించిన ఇబ్బందులను తీరుస్తాం. వరి ఎక్కువగా సాగు చేసే ఈ ప్రాంతంలో తగిన గిట్టుబాటు ధరలు కల్పించేలా చూస్తాం. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ రకరకాల ప్రచారం చేసింది. చివరకు ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చింది. మూడు రాజధానుల పేరుతో భారీ స్కాం చేయాలని వైసీపీ భావించింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో రాజధానుల నిర్మాణాన్ని పక్కన పెట్టింది. సహజ వనరులను వైసీపీ దోచుకుంది. వైసీపీ పాలన అంతా ఇసుక, మద్యం మాఫియాలతోనే నడిచింది. ఈ ప్రభుత్వం అవినీతిలో మంచి స్పీడులో ఉంటే, అభివృద్ధి కాడి వదిలేసింది. మద్యం లావాదేవీల్లోనూ భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అయిదేళ్ల పాలనలో అవినీతి నిర్వహణ తప్ప.. అభివృద్ధి నిర్వహణ పూర్తిగా లేదు.
• అవినీతి సొమ్ము కక్కించేందుకు చట్టం యోచన
2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రపంచ దేశాలన్నీ కాంగ్రెస్ పాలన అవినీతి గురించి మాట్లాడుకునేవారు. రోజుకో స్కాం బయట పడేది. ప్రస్తుతం ఇండియా కూటమిలోని నాయకులంతా అవినీతిలో కూరుకుపోయారు. ఈడీ దాడుల్లో ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో దొరుకుతున్న డబ్బు కట్టలు దేశాన్ని విస్తుపరుస్తున్నాయి. జార్ఖండ్ లో ఓ కాంగ్రెస్ మంత్రి పీఏ ఇంట్లో పని చేస్తున్న ఓ కూలి ఇంట్లో దొరికిన డబ్బు కట్టలను లెక్కపెట్టేందుకు నోట్ల యంత్రాలే అలసిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలోనూ ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో భారీగా ధనాగారం బయటపడింది. ఇంతటి డబ్బును కాంగ్రెస్ నేతలు దేనికోసం సేకరిస్తున్నారు..? ఎక్కడికి పంపుతున్నారనే దానిపైనా విచారిస్తాం. ప్రజాధనాన్ని మింగే అవినీతి నేతలను జైలుకు పంపడానికి మోదీ గ్యారెంటీ బలంగా ఉంది. అవినీతిలో దొరుకుతున్న కాంగ్రెస్ నాయకులంతా కాంగ్రెస్ మొదటి తరం కుటుంబానికి సన్నిహితులు. వారు ఈ డబ్బును ఏదైనా సరఫరా కోసం దాచారా.. లేక మరే ఉద్దేశం కోసం దాచారా అనేది తెలియాలి. దీనిపై కాంగ్రెస్ రాకుమారుడి దగ్గర నుంచి జాతి సరైన జవాబును ఆశిస్తోంది. ఈడీకి దొంగలు దొరికినప్పుడల్లా నన్ను ఇష్టానుసారం తిడతారు. శాపనార్థాలు పెడతారు. నేను దేనికీ లొంగే వ్యక్తిని కాను.. వారు ఎన్ని తిట్టుకున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. ప్రజల డబ్బుకు కాపాలాగా నిలుస్తాను. వారి డబ్బు వారికే చెందేలా పని చేస్తాను. దేశ వ్యాప్తంగా ఈడీ దాడుల్లో రూ.1.25 లక్షల కోట్ల సంపదను అవినీతి పరుల నుంచి అటాచ్ చేసింది. కేవలం అటాచ్ మెంట్లు, జప్తు కాకుండా అవినీతి పరులు తినేసిన సొమ్మును తిరిగి వారి నుంచే మళ్లీ రాబట్టే కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. దోచుకున్న వారి నుంచే మళ్లీ రికవరీ చేసే ఆలోచనతో న్యాయ నిపుణులతో మాట్లాడి చట్టానికి పదును పెడతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా దోపిడీదారులు దోచుకున్న డబ్బును కక్కిస్తాం.
• ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయం కోసం ఎన్టీయేకు ఓటు వేయండి
ఎన్టీయే కూటమి దేశంలోనే కాదు.. ఏ రాష్ట్రంలో కూటమిగా ఉన్నా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నెల 13న ప్రజలు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ కు నూతనాధ్యాయం కావాలి. వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ కోసం అంతా బాధ్యత తీసుకోవాలి. ఎన్టీయే పాలన నుంచి రాష్ట్ర అభివృద్ధి యాత్ర మొదలు కాబోతోంది. దేశంలో సంస్కరించాలి.. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశం గురించి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తోంది. చర్చిస్తోంది. ఈ అభివృద్ధి ప్రస్థానంలో అవినీతి వైసీపీని పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అమరావతి – విజయవాడ నుంచి హైదరాబాద్ అనుసంధానం చేసే రహదారులు నిర్మిస్తాం. దిల్లీ – ముంబయి ఇండిస్ట్రీయల్ కారిడార్ కు ధీటుగా విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ రాబోతోంది. చెన్నై – కోల్ కత హైవే తో ఆంధ్ర స్వరూపం మారుతుంది. రైల్వే జోన్ తో పాటు అన్ని ప్రాంతాలకు జాతీయ రహదారులు, ఫిషింగ్ హార్బర్ లు వస్తాయి. రాష్ట్రానికి అభివృద్ధిని జోడించే కనెక్టవిటీ మరింత పెరిగేలా మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. సీ ఫుడ్ ఉత్తత్తులను పెంచుతాం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సిరులకు నిలయంగా మారుస్తాం. సీ ఫుడ్ ఎగుమతుల్లో అగ్రగామిగా తీసుకెళ్తాం. ఎన్డీయే హయాంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.
• ఎన్డీయే విజయం… ప్రజల విజయం
కేంద్రంలో కాంగ్రెస్ తో రాష్ట్రంలో వైసీపీతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్టీయే హయాంలో 500 సంవత్సరాల నాటి అయోధ్య రామమందిరం కలను నిజం చేశాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేశాం. కాంగ్రెస్ నేతలు కావాలనే అయోధ్య మందిర ప్రతిష్టాపనను బాయ్ కాట్ చేశారు. వారికి జాతి ఆకాంక్షల మీద నమ్మకం లేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ మోదీ గ్యారెంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం తో అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఎన్టీయే విజయం.. ప్రజల విజయం.. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్లా ఎన్టీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ఎంపీ అభ్యర్థులను, ఇటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థలను భారీ మెజారిటీ గెలిపించి ఆంధ్రను అగ్రగామిగా తీసుకెళ్లే ప్రయాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి’’ అన్నారు.