కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా అందిస్తాం

• శ్రీ మోడీ పాలనలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే… జగన్ పాలనలో శ్రీరాముడికి శిరచ్ఛేదం జరిగింది
• పరిపాలన అంటే పబ్జీ ఆడుకోవడం అనుకొనే ముఖ్యమంత్రి ఉండటం రాష్టానికి శాపం
• జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది
• ఉత్తరాంధ్ర ప్రాంతంపై కాదు.. ఇక్కడున్న గనులు, భూములపైనే వైసీపీ నాయకులకు ప్రేమ
• అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే… వైఎస్ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి శిరచ్ఛేదం జరిగింది. వందలాది దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేశారని, ఆలయ రథాలు తగలబెట్టార’ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన అంటే పబ్జీ ఆడుకోవడం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపం అన్నారు. విశాఖను, మన్యాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేసి, యువతను గంజాయికి బానిసలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వ పటిమ, శ్రీ చంద్రబాబు గారి అనుభవం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి రాష్ట్రానికి ఎంతో అవసరం. 2047 నాటికి దేశం అగ్రరాజ్యంగా ఎదగాలని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆలోచన చేస్తుంటే… జగన్ పెత్తందారి పాలన చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని 25 ఏళ్లు వెనక్కి నెట్టారు. అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేయాలని భావించింది. ఈ ప్రాంత ప్రజలతో నేను మమేకం అయ్యాను. అయితే బీజేపీ పోటీ చేస్తాను అనగానే మా అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు మనస్ఫూర్తిగా అంగీకరించారు. మా కుటుంబానికి కావలసిన శ్రీ సి.ఎం.రమేశ్ గారు పోటీ చేయడం సంతోషకరం.
• తప్పు చేసి ఆ నెపం బీజేపీపై మోపుతున్నారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రమాదకరమైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను వైసీపీ తీసుకొచ్చింది. ఆస్తులకు రక్షణ లేకుండాపోతుందని ప్రజలు ఎదురు తిరగడంతో యాక్ట్ తెచ్చింది మేము కాదు కేంద్రం అని… ఆ తప్పును బీజేపీ మీదకు తోసేసింది. వైసీపీ పాలనపై ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. చివరకు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూటమి అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. వైసీపీ ఎన్ని కవ్వింపులు, కుయుక్తులు పన్నినా గెలిచేది కూటమి ప్రభుత్వమే. రాష్ట్రంలో బలమైన ముద్ర వేస్తున్నాం.
• ఉత్తరాంధ్రను జగన్ వంచించాడు
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని జగన్ వంచించాడు. ఈ ప్రాంతంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును అటకెక్కించాడు. ఆయనకు నిజంగా ఈ ప్రాంతంపై ప్రేమే ఉంటే సుజల స్రవంతిని సకాలంలో పూర్తి చేసి రైతాంగం కళ్లల్లో ఆనందం నింపేవాడు. వైసీపీ నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్న గనులు, భూములపై ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలు తీర్చడంలో లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా అందిస్తాం. యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సకాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తాం. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలంటే కేంద్రంలో మోడీ సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని” అన్నారు.