ప్రధాని మోదీకి టీకా ఎప్పుడు?.. రాజ్ నాథ్ సింగ్ సమాధానం..

ఇండియాలో కరోనా టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభమైంది. తొలి దశలో ఫ్రంట్ లైన్ యోధులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే టీకాను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు పలువురు తమతమ రాష్ట్రాల్లో తొలి టీకాను వేసుకుంటామని తెలిపినా, వారిని ఈ ప్రక్రియకు దూరంగా ఉంచింది. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ టీకాను ఎప్పుడు తీసుకుంటారు? ఆయన టీకాను తీసుకుంటేనే ప్రజలకు టీకాపై నమ్మకం కలుగుతుంది అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్న వేళ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

తాజాగా, ఓ జాతీయ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, మోదీ టీకా విషయంలో ఎప్పటికప్పుడు సైంటిస్టులతో మాట్లాడుతూ, అప్ డేట్స్ తీసుకుంటూనే ఉన్నారని స్పష్టం చేశారు. కరోనా యోధులకు టీకా ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మొదలైందని, ఇది ముగిసిన తరువాత, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకాను ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని ఆయన అన్నారు. ఆ జాబితాలోనే మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఉంటారని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.