డోసుల మధ్య విరామం పెంపుతో.. ముప్పు: ఆంటోనీ ఫౌచీ

కొవిడ్‌ టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం వల్ల.. వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ల బారినపడే ముప్పు ప్రజలకు పెరుగుతుందని అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ భారతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని గతనెలలో భారత ప్రభుత్వం పెంచడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. ”ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌కు ఈ విరామం 3 వారాలుగా, మోడెర్నా టీకాకు అది 4 వారాలుగా ఉంది. దాన్ని మరింత పొడిగించడం వల్ల ప్రజలు కరోనాలో కొత్త వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉంది. బ్రిటన్‌లో ఈ విరామాన్ని పొడిగించినప్పుడు అదే పరిస్థితి ఉత్పన్నమైంది. షెడ్యూల్‌ ప్రకారం టీకాలు వేయాలి” అని ఆయన పేర్కొన్నారు.