రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు

పెడన, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని స్పష్టంగా అర్థం అవుతోంది. అవగాహన లేని హోంమంత్రి, సమాచారం లేని ముఖ్యమంత్రి. విజయవాడ నగరం నడిబొడ్డున ఓ మానసిక వికలాంగురాలు అత్యాచారానికి గురైన విషయం రాష్ట్రంలో సామాన్యులు కూడా తెలుసు. అలాంటిది మహిళా హోమ్ మినిస్టర్, సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరం. జగన్ రెడ్డి మంత్రి వర్గానికి ఇప్పటివరకు అధికారాలు మాత్రమే లేవు అనుకున్నాం. నిన్నటి హోమ్ మినిస్టర్ ప్రెస్మీట్ తర్వాత మంత్రులకు అవగాహన కూడా లేదని స్పష్టంగా అర్థమైంది. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని జగన్ రెడ్డి భజన బ్యాచ్ ప్రాస కోసం వాడే డైలాగ్ అని జనాలకు అర్థం అయింది. దిశా చట్టం ఓ బూటకం అని అర్థమైంది. దిశ చట్టాన్ని వైసీపీ ప్రచార అస్త్రంగా కాకుండా, మహిళలకు రక్షణ కవచంలా తయారు చేయాలి. గతంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసే పోలీస్ శాఖ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులెతున్నారని ఆరోపణ బలంగా ఉంది. ఇది పోలీస్ వ్యవస్థకు మంచిది కాదు. నిజానికి మొన్న విజయవాడలో జరిగిన సంఘటన విషయంలో పోలీసుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. అత్యాచారానికి గురైన బాధితురాలికి సత్వర న్యాయం జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.