ఓటమి భయంతోనే భౌతిక దాడులకు తెగబడుతున్న వైసీపీ

  • ప్రజల్ని భయపెట్టి ఎన్నికలు చేయాలని చూస్తున్నారు
  • వైసీపీ గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు
  • మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది
  • స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ఒక్కఛాన్స్ ఒక్క చాన్స్ అంటే ఎంతో నమ్మకంతో అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు నరకం చూపిస్తూ సాగిన వైసీపీ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయని, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ప్రచార వాహనంపై రాళ్లు వేయటమే కాకుండా వ్యాన్ డ్రైవర్ ను గొంతు పట్టుకొని వైసీపీ నేతలు భౌతిక దాడికి పాల్పడటంపై ఆయన శనివారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారం చేసుకోవటం రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. అలాంటి హక్కును తమ దౌర్జన్యాలతో వైసీపీ నాయకులు కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ దాష్టీక పాలనతో ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ అరాచకాలు సృష్హించి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా వైసీపీ దుర్మార్గాలను అడ్డుకోవటంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడులపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. మా సహనానికి ఓ హద్దు ఉంటుందని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. తాము చట్టానికి, రాజ్యాంగానికి లోపడే ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా కూటమి అభ్యర్థుల విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. స్వేచ్చాయిత ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అధికారులు, పోలీసులు చట్టవ్యతిరేకమైన, రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వెంటనే ఎన్నికల కమీషన్ కు తెలియచేయాలని ప్రజల్ని ఆళ్ళ హరి కోరారు.