వైసీపీ నేతల ధనదాహంతో పేదల కంట రక్తకన్నీరు

గుంటూరు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా జగనన్న కాలనీల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని, వైసీపీ నేతల ధనదాహానికి నిరుపేదలకు గూడు లేకుండా పోయిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జగనన్న మోసం, జగనన్న కాలనీలు, పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన చేపట్టిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా శనివారం 16 వ డివిజన్ పరిధిలోని బుడంపాడు, ఏటుకూరులలోని జగనన్న కాలనీలను డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ నేతృత్వంలో పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా జగమంత మోసం – జగనన్న మోసం. జగనన్న కాలనీలు – అవినీతికి ప్రతిరూపాలు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ పది లక్షలు కూడా చేయని స్థలాలకు 60, 70 లక్షలు చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే 98.4 % హామీలు నెరవేర్చామంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు అందులో జగనన్న కాలనీల గురించి మరచిపోయారేమోనని ఏద్ధేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగటంతో పేదలకు సొంత ఇల్లు కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టీకాలతోనే ప్రజలు నరకం అనుభవిస్తా ఉంటే మరోవైపు పేదలకు కట్టించే ఇళ్ళల్లోనూ అవినీతికి తెరతీయటం నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజల జీవనవిధానానికి శరాఘాతంలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఏ కాలనీలోనూ సరిగ్గా ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు అంటే పేదల ఇల్లు అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో అర్ధమౌతుందని దుయ్యబట్టారు. మాయమాటలతో, అబద్ధపు హామీలతో, సానుభూతి వచనాలతో ఇన్నాళ్లూ ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్న వైసీపీ నేతల కరుడుగట్టిన నిజ స్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేసేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా జగనన్న మోసం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో కనిపిస్తున్న ఖాళీ ప్రదేశాలను, పునాధికి మాత్రమే పరిమితమైన ఇళ్ల నిర్మాణాలకు సంభందించిన ఫోటోలను జనసేన పార్టీ నేతలు బాహ్య ప్రపంచానికి తెలిసేలా విడుదల చేశారని, ఈ ఫోటోలను చూసిన ప్రజలు వైసీపీ నేతల పని తీరుపై విస్తుపోతున్నారని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు లక్ష్మీ దుర్గ , యర్రంశెట్టి పద్మావతి, పార్టీ నేతలు మాణిక్యాలరావు, ప్రసాద్, కిరణ్, చింతా రాజు, యడ్ల మల్లి, దాసరి వాసు, ఉపేంద్ర, సింగ్, బాషా, రవీంద్ర, చందు శ్రీరాములు, కార్తిక్, పాములూరి కోటి, సోమి ఉదయ్, త్రిపుర, మల్లేశ్వరి, అరుణ, కవిత, ఆషా, సత్యం, గల్లా కోటి, వీరాంజనేయులు, నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.