యడియూరప్పకు గవర్నర్ పదవి దక్కే ఛాన్స్?

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడ్డీని గవర్నర్ కోరారు. మరోవైపు కొత్త సీఎంను ఎంపిక చేసే పనిలో బీజేపీ హైకమాండ్ నిమగ్నమయింది.

తాజాగా యడియూరప్పకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన యడియూరప్పను పార్టీ హైకమాండ్ సమున్నతరీతిలో గౌరవించాలని భావిస్తోందనేదే ఆ వార్త. ఈ క్రమంలో ఏపీకి కానీ లేదా మరో రాష్ట్రానికి కానీ ఆయనను గవర్నర్ గా నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లను పక్కకు తప్పించి, వారిని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. ఇదే కోవలో యడియూరప్పకు కూడా గవర్నర్ ఛాన్స్ లభించబోతోందని చెపుతున్నారు.