Yogi Adityanath: వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు

యుపి ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌పై ఒక కేసు నమోదైంది. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీహార్‌ ముజఫర్‌పూర్‌ కోర్టులో సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఒక పిటిషన్‌ వేశారు. ఆదివారం కుషీనగర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యుపి ముఖ్యమంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 2017లో తాను అధికారంలోకి వచ్చిన అనంతరమే యుపిలో ప్రజాపంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందని, ఇక్కడ పేదలకు అంటే అబ్బాజాన్‌ ( ముస్లింలను వారి తండ్రి ఉద్దేశించి వినియోగించే పదం ) అని చెప్పేవారు తింటున్నారని అన్నారు. పరోక్షంగా ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. ఈవ్యాఖ్యలతో ముస్లింకమ్యూనిటీ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని.. సంబంధిత సెక్షన్‌ల కింద యోగిపై చర్యలు తీసుకోవాలంటూ తమన్నాహష్మీ ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కాగా, గతంలోనూ తమన్నాహష్మీ పలువురు రాజకీయ నేతలపై పిటిషన్‌లు దాఖలు చేశారు.